బినామీ ఆస్తుల కేసులోడిప్యూటీ సీఎం అజిత్ పవార్‎కు బిగ్ రిలీఫ్

బినామీ ఆస్తుల కేసులోడిప్యూటీ సీఎం అజిత్ పవార్‎కు బిగ్ రిలీఫ్

న్యూఢిల్లీ: బినామీ ఆస్తుల కేసులో ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‎కు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. 2021లో సీజ్ చేసిన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను క్లియర్ చేసింది. అజిత్ పవార్ పై వచ్చిన ఆరోపణలను ప్రివెన్షన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసిన అనంతరం ఐటీ శాఖ ఈ మేరకు ఆయన కుటుంబానికి చెందిన 3 ఆస్తులను క్లియర్ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

అవి బినామీ ఆస్తులు కావని, వాటికి అజిత్ పవార్, ఆయన కుటుంబమే అసలైన ఓనర్లని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ.. ‘‘బీజేపీ కూటమిలో చేరిన తర్వాత నాకు క్లీన్ చిట్ వచ్చిందని నా ప్రత్యర్థులు అంటున్నారు. కానీ కూటమిలో చేరి దాదాపు17 నెలలు అవుతోంది. చేరిన వెంటనే నాకు క్లీన్ చిట్ ఇచ్చి ఉండాల్సింది కదా. ఇంత సుదీర్ఘ సమయం తర్వాత నా ఆస్తులను ఎందుకు క్లియర్ చేశారు..? ఒకరిపై వచ్చిన ఆరోపణలను గుడ్డిగా నమ్మడం కరెక్టు కాదు.

 కేసుల్లో అప్పీల్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది” అని పేర్కొన్నారు. కాగా, అజిత్ పవార్​కు బినామీ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో దాఖలైన కేసులో ఐటీ శాఖ 2021లో రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే, జరందేశ్వర్ షుగర్ మిల్లును వేలంలో ఓ కంపెనీ దక్కించుకోగా.. దానికి కూడా అజిత్ పవార్ ఓనర్ అన్న ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కేసును కూడా దర్యాప్తు చేసింది.