![నాని ‘దసరా’ సినిమా విలన్ షైన్ టామ్ చాకోకు పదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్](https://static.v6velugu.com/uploads/2025/02/big-relief-for-nani-dasara-movie-villan-shine-tom-chacko-in-2015-drug-case_q9jNnHJ3FG.jpg)
నాని ‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోకు డ్రగ్స్ కేసులో ఊరట దక్కింది. 2015లో అతనిపై నమోదైన డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా చాకో బయటపడ్డాడు. ఈ ‘దేవర’ సినిమా నటుడిని కొచ్చిలోని అడిషనల్ సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కూడా నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. షైన్ టామ్ చాకో తండ్రి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాడు. పదేళ్ల క్రితం నమోదైన డ్రగ్స్ కేసులో ఊరట దక్కడంతో షైన్ టామ్ చాకో కూడా సినిమాలు చేసుకుంటూ ఇకపై ప్రశాంతంగా ఉండొచ్చు.
NDPS చట్టం, 1985 ప్రకారం కొకైన్ కేసులో 2015లో చాకోపై కేసు నమోదైంది. సరైన ఆధారాలను ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో చాకోతో పాటు మరో ఆరుగురుని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. జనవరి 30, 2015న కొచ్చి పోలీసులు షైన్ టామ్ చాకోతో పాటు మరో నలుగురు మహిళా మోడల్స్ను ఒక ఫ్లాట్లో పార్టీ చేసుకుంటూ కొకైన్ తీసుకున్నారనే అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొచ్చి అడిషనల్ సెషన్స్ కోర్టులో 2018లో మొదలైంది.
చాకోతో పాటు మరో ఆరుగురు కొకైన్ తీసుకున్నారని పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానించిన చాకోతో పాటు మిగిలిన ఆరుగురి బ్లడ్ శాంపిల్స్ను న్యూఢిల్లీ, హైదరాబాద్లోని కెమికల్ ఎనలిటికల్ ల్యాబ్స్కు పంపించారు. ఈ బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా పరీక్షల్లో కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ కాలేదు.
అయితే.. పోలీస్ రైడ్స్ గురించి ముందే సమాచారం అందడంతో కొకైన్ను టాయ్లెట్లో ఫ్లష్ చేశారని ఒక మలయాళ న్యూ్స్ ఛానల్ రిపోర్ట్ చేసింది. వీరిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు కొకైన్ దొరికినట్లుగా ఫొటోలను అప్పట్లో విడుదల చేశారు. నటుడు చాకోతో పాటు ఈ కేసులో ఇరుక్కున్న వాళ్లంతా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2015, మార్చిలో బెయిల్పై విడుదలయ్యారు.