నిత్యం రద్దీగా ఉండే రహదారి.. నేషనల్ హైవే.. అయినా సరే దోపిడి దొంగలు రాజ్యమేలుతున్నారు. అనంతపురం నేషనల్ హైవేకు దగ్గరగా .. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే....
అనంతపురంలో భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నాలుగు కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం సవేరా హాస్పిటల్ కు దగ్గరలో రాజహంసా విల్లాస్ లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దోపిడి దొంగలు పడ్డారు.బిజినెస్ మ్యాన్ శివారెడ్డి ఇంట్లో చొరబడ్డ దొంగలు విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు.తన కుమార్తె పెళ్లి కోసం ఉంచిన నగలు.. నగదు చోరీ చేశారు. 3.50 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 25 లక్షల రూపాయల నగదు అపహరించినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కదలికలు సీసీ కెమారాల్లో రికార్డు అయ్యాయి. అయితే నేషనల్ హైవే కు దగ్గరలో నిఘా అధికారులు నిద్రపోతున్నారా అంటూ స్థానికంగా చర్చ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఉన్న సిబ్బంది పలు విధులు నిర్వహిస్తూ.. అధికారులకు.. ప్రజా ప్రతినిథులకు భద్రత కల్పిస్తున్నారు. కొంతమంది అనారోగ్యంతో సెలవులో ఉన్నారు.