ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

బయ్యారం(మహబూబాబాద్ అర్బన్​), వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్​కు నిరసన సెగ తగిలింది. బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. రేషన్ షాపులో సన్న బియ్యం ఇవ్వడంలేదని, నూకలు తిని బతుకుతున్నామని నిరసన తెలిపారు. సన్నబియ్యం ఎప్పుడిస్తారని నిలదీశారు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా తమకు ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. 

దళితబంధు స్కీం కూడా అందలేదన్నారు. హరిప్రియ ఎంత సముదాయించినా గ్రామస్తులు వెనక్కి తగ్గకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని, కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సన్న బియ్యం ఇస్తామన్నారు. అయితే, రెండు సార్లు గెలిచినా సంక్షేమ పథకాలు అందలేదని.. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఇస్తామనడం ఏమిటని గ్రామస్తులు ఆమెను నిలదీస్తూ ప్రచారాన్ని అడ్డుకున్నారు. 

దీంతో ఆమె ప్రచారాన్ని ఆపేసి గ్రామం నుంచి వెళ్లిపోయారు. గ్రామస్తులు తనను అడ్డుకుంటే ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్, ఇతర నాయకులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.