
నటుడు పోసాని కృష్ణమురళికి షాక్ మీద షాక్ తగులుతోంది. బెయిల్ దొరికింది.. ఇక బయటకు వెళ్లొచ్చు అనుకునే లోపే కోర్టు మరోసారి రిమాండ్ వార్త వినాల్సి వచ్చింది. ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరైన 24 గంటల్లోనే మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడంతో కర్నూలు జైలుకు చేరుకున్నారు గుంటూరు సీఐడీ అధికారులు. పోసానిని కర్నూలు జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:-వ్యాపారుల మధ్య గొడవలు.. ఇద్దరూ బాగా డబ్బున్నోళ్లే అంట..!
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన క్రమంలో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కడప కోర్టు పోసానికి రిమాండ్ విధించటంతో రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. ఆ తర్వాత పీటీ వారెంట్ పై నరసరావుపేట, గుంటూరు, కర్నూలు.. ఇలా పలు జైళ్లకు తరలించారు పోలీసులు.
అయితే ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు చేయడంతో కర్నూలు జైలు నుంచి పోసాని ఇవాళ (మార్చి 12) బెయిల్ పై విడుదల అవ్వాల్సి ఉంది. తాజాగా మరో 14 రోజులు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలిస్తున్నారు అధికారులు.