ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా జగన్ కు వెరీ బిగ్ షాక్.. జగన్ తోపాటు జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వైఎస్ మరణం తర్వాత సీబీఐ కేసుల్లో జగన్ తోపాటు మోపిదేవి కూడా జైలుకెళ్లారు.
2019 ఎన్నికల్లోనే రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. అయినా కూడా తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో ఆయనను మంత్రిని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆపై మండలిని రద్దు చేయాలనే ఉద్దేశంతో.. ఎమ్మెల్సీగా రాజీనామా చేయించి.. రాజ్యసభకు పంపించారు జగన్. అలాంటి మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేస్తున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
వైసీపీ రాజ్యసభ ఎంపీతోపాటు పార్టీకి సైతం రాజీనామా చేయబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మోపిదేవి రాజీనామా వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన వెంటే నడిచిన మోపిదేవికి.. జగన్ చేయాల్సింది అంతా చేశాడని.. ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రిని చేశారు.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని చేశారు.. అలాంటి మోపిదేవి అమ్మలాంటి పార్టీని వదిలి టీడీపీలోకి వెళుతున్నారని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, తన రాజీనామా వార్తలపై ఎంపీ మోపిదేవి మాత్రం అధికారికంగా స్పందించలేదు.. ఖండించనూ లేదు.