తెలంగాణ వస్తే మన హక్కులు న్యాయంగా దక్కుతాయని అందరూ ఆశపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడొచ్చని అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ సర్కారు వచ్చాక పరాయి పాలకుల కన్నా దారుణంగా తయారైంది. ఒకవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. మరోవైపు, రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం రూల్స్‌కు విరుద్ధంగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవోలు ఇస్తోంది. ఇటు లక్షకు పైగా ఖాళీ పోస్టుల రిక్రూట్‌మెంట్స్ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో, అటు అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. చాలా డిపార్ట్‌మెంట్లలో పెద్దాఫీసర్ల సర్వీసును రిటైర్ అయినంక కూడా పొడిగిస్తూ టీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులు ఇస్తోంది. సుమారు 15 మంది సర్వీసును పొడిగిస్తూ ఇటీవల విడుదల చేసిన జీవోలను రహస్యంగా ఉంచడం ప్రభుత్వ కుట్రపూరిత ధోరణికి నిదర్శనం.
ఆర్ అండ్ బీలో వారిద్దరిదే హవా..
టీఆర్ఎస్ సర్కారు తమకు కావాలనుకున్న వారికి నిబంధనలతో పని లేకుండా, సర్వీసు పొడిగిస్తోంది. రోడ్లు, భవనాల శాఖలో ఇద్దరు ఈఎన్సీల సర్వీసును పొడిగిస్తూ సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. గణపతిరెడ్డి(నేషనల్ హైవేస్), రవీందర్‌రావు (స్టేట్ హైవేస్) ఆరేండ్లుగా ఈ సర్వీసుల్లో కొనసాగుతున్నారు. గణపతిరెడ్డి సర్వీసు 2016లోనే పూర్తికాగా.. అప్పటి నుంచి పొడిగిస్తూ వస్తున్నారు. మొదట మూడేండ్లు, ఆ తర్వాత ఏడాది, తాజాగా మరో ఏడాది పొడిగించారు. ఇక రవీందర్‌రావు సర్వీసు కూడా 2016లోనే ముగిసినా తొలుత రెండేండ్లు, ఏడాది చొప్పున మరో రెండుసార్లు, ఇప్పుడు ఇంకో ఏడాది పెంచారు. ఈ శాఖలో మూడేండ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు. మొదలు పెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పనులు పూర్తి చేయాలంటూ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడమే వీరి పని. వీళ్లిద్దరు మాత్రమే ఆరేండ్లుగా పదవుల్లో కొనసాగడానికి కారణం ఏమిటి? వీరికున్న ప్రత్యేక అర్హతలు ఏమిటి? మిగతా ఉద్యోగులకు వీళ్లలా పనిచేసే టాలెంట్ లేదా? కింది స్థాయి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఆరేండ్లుగా వీరినే కొనసాగించడానికి కారణం ఏమిటి? వాళ్లేమైనా సీఎం కుటుంబానికి బినామీలా? గణపతిరెడ్డి, రవీందర్‌రావు ప్రగతి భవన్ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రగతి భవన్ నిర్మాణ వ్యయాన్ని ఐదింతలు పెంచడంతోపాటు కలెక్టరేట్లు, పోలీస్ టవర్ నిర్మాణం అంచనా ఖర్చులు మూడింతలు పెరగడంలో వీరిద్దరిదే కీలక పాత్రనే విమర్శలు ఉన్నాయి.
విద్యుత్ శాఖలోనూ జీ హుజూర్ అనేటోళ్లకే
విద్యుత్ శాఖ సీఎండీగా పదవీ విరమణ చేసిన దేవులపల్లి ప్రభాకర్‌రావును ఆ స్థానంలో మళ్లీ నియమించారు. పదవీకాలం ముగిసినా మళ్లీ పొడిగించారు. సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పట్లో ఆయన కు వచ్చిన ఢోకా ఏమీ లేదనే చెప్పాలి. ఎస్పీడీసీఎల్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన రఘుమారెడ్డి, ఎస్ఈగా పనిచేసిన గోపాల్‌రావులనూ సీఎండీలుగా కొనసాగిస్తుండటం గమనార్హం. వీళ్లంతా రిటైర్ అయినవాళ్లే. తెలంగాణ ఏర్పాటు తర్వాత కరెంట్ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరగడంతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణాల వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచారని, డిస్కంలకు అవసరం లేని పరికరాలు కొని వేల కోట్లు ఖర్చు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే.. చిత్తశుద్ధితో పనిచేసే వారిని పక్కన పెట్టిన ప్రభుత్వ పెద్దలు ఏంచెప్పినా జీ హుజూర్ అంటూ పని చేసే వాళ్లకే సీఎండీ బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి కంపుకొడుతున్న ఇరిగేషన్
ఇరిగేషన్ శాఖ పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ఇంజ నీర్ ఇన్ ఛీప్‌గా రిటైర్ అయిన మురళీధర్‌రావు ఆ పదవిలో నాలుగేండ్లుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో వేల కోట్ల అక్రమాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్‌గా వెంకటేశ్వర్, మరో చీఫ్ ఇంజనీర్ అంజద్ ఖాన్ రెండేండ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2020లో రిటైర్ అయిన వీరయ్య సర్వీస్ మరో ఏడాది పొడిగించారు. అదే శాఖలో ఎస్ఈగా రిటైర్ అయిన సుధాకర్‌రెడ్డి పదవీకాలాన్నీ ఏడాది పొడిగించారు. గ్రేడ్–బి భువనగిరి ఈఈగా పని చేస్తున్న శంకర్‌నాయక్‌కు ఏడాదిన్నర ఎక్స్టెన్షన్ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల అంచనా ఖర్చులను పెంచి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కీలక జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్న ప్రభుత్వం, సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు కూడా పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదు. రిటైరైన ఉన్నతాధికారులను కన్సల్టెంట్లుగా అదే పోస్టుల్లో ప్రభుత్వం నియమిస్తోంది. ప్రమోషన్లు రాని ఉద్యోగులు కోర్టుకు వెళ్తారన్న భయంతోనే జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచటం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయడం లేదు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుండడంతో మిగిలిన ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అయిపోతున్నారు. ఈసీఎం బంధుగణం, అనుచరులనే కారణంతో పదవీ కాలాన్ని పెంచుకుంటూపోతూ.. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేయడం క్షమించరానిది. అక్రమంగా పదవుల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలి. లేకపోతే ఉద్యోగులు, నిరుద్యోగులను ఏకం చేసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.
చాలా శాఖల్లో అదే తీరు
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మిషన్ భగీరథ ఈఎన్సీగా కృపాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ ఆదేశాలను శిరసావహిస్తాడని ఆయనకు మళ్లీ మళ్లీ సర్వీస్ పొడిగిస్తూ వస్తున్నారు. ఐదేండ్లకు మించి పదవిలో ఉండకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగిస్తున్నారు. పదవీ కాలం ఎప్పుడో ముగిసినా.. ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు సర్వీస్ పొడిగించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి రూల్స్‌కు విరుద్ధంగా ఆ పదవిలో కంటిన్యూ అవుతున్నారు. అన్ని కీలక పదవుల్లో సీఎం అనుచర, బంధుగణం పదవీకాలం ముగిసినా ఏండ్ల తరబడి ఆ సీట్లల్లో పాతుకుపోవడంతో తమకు రావాల్సిన ప్రమోషన్లు రావట్లేదని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -ఇందిరా శోభన్, పీసీసీ అధికార ప్రతినిధి.
ఇవి కూడా చదవండి
‘చిత్రం’ సీక్వెల్ అనౌన్స్ చేసిన తేజ
కబడ్డీ.. గ్రౌండ్‌లో ఆట..బయట ఆడితే వేట
అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్
అప్పుడు పబ్.. ఇప్పుడు వైల్డ్‌లైఫ్ హాస్పిటల్