కొల్లాపూర్ లో ​ప్రధాన పార్టీల అభ్యర్థులకు బర్రెలక్క టెన్షన్​

కొల్లాపూర్ లో ​ప్రధాన పార్టీల అభ్యర్థులకు బర్రెలక్క టెన్షన్​
  • హామీలు ఇచ్చి నెరవేర్చలేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే బీరంపై ఓటర్లలో అసంతృప్తి
  • సర్కారు, ఎమ్మెల్యేపై వ్యతిరేకతే గెలిపిస్తుందంటున్న కాంగ్రెస్​ అభ్యర్థి జూపల్లి 
  • సంచలనం సృష్టిస్తానంటున్న  బీజేపీ క్యాండిడేట్​ ఎల్లేని
  • సైలెన్స్​గా దూసుకొచ్చిన శిరీష

నాగర్​కర్నూల్, వెలుగు  :  నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ ఈసారి రసవత్తర పోరుకు వేదికైంది. బీఆర్ఎస్​ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి బరిలో నిలవగా, కాంగ్రెస్ ​నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుంచి ఎల్లేని సుధాకర్​రావు పోటీ చేస్తున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు నిరుద్యోగుల సమస్యతో పోటీలో నిలిచిన ఇండిపెండెంట్​అభ్యర్థి బర్రెలక్క అలియాస్​శిరీష నిద్ర పట్టకుండా చేస్తోంది. ఈమెకు వస్తున్న మద్దతును చూసి సదరు పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. కల్వకుర్తి, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, మిషన్ ​భగీరథ కోసం సేకరించిన భూముల పరిహారం పెండింగ్, పునరావాస సమస్యలు అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. ఇక ప్రతి ఎన్నికల్లో శ్రీశైలం నిర్వాసితుల సమస్య, మాదాసీ కుర్వలు, వాల్మీకి బోయల రిజర్వేషన్ల డిమాండ్​ ప్రధానంగా వినిపి స్తోంది. ప్రాసెసింగ్ ​యూనిట్​ లేకపోవడంతో మామిడి రైతులను మార్కెట్​ కష్టాలు వెంటాడుతున్నాయి. కృష్ణాతీర గ్రామాల్లో చేపల వేటపై ఆధారపడిన  మత్స్యకారులకు కోల్డ్​ స్టోరేజీ యూనిట్లు లేక శ్రమ దళారుల పాలవుతోంది. శ్రీశైలం ముంపు నిర్వాసితులకు న్యాయం చేయకపోతే చిన్నంబావి చౌరస్తాలో చెట్టుకు రాజీనామా కడతానని గత ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్​ రెడ్డి ప్రకటించారు. గెలిచాక బీఆర్​ఎస్​లో చేరిన ఆయన 300 మంది  శ్రీశైలం నిర్వాసితులకు సాయం అందించి మిగిలిన బాధితులను, రాజీనామాను మరిచిపోయారంటున్నారు.  

ALSO READ :- ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలె: వివేక్ వెంకటస్వామి

‘బీరం’.. చెప్పి చేయనివి ఎన్నో...

కొల్లాపూర్ నియోజక ప్రజల చిరకాల వాంఛ అయిన సోమశిల-- –సిద్దేశ్వర బ్రిడ్జి సాధిస్తానని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ​నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్​రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ లీడర్ల చొరవతో కేంద్రం నిధులు మంజూరు చేసినా నేటికీ టెండర్లు పిలవలేదు. హైవేతో పాటు కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి మంజూరులో హర్షవర్ధన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని స్థానికులు నమ్ముతున్నారు. వాల్మీకి బోయలు, మదాసి కుర్వలను ఎస్సీ జాబితాలో చేర్పించి సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చినా చేసిందేమీ లేదు. దీంతో ఆ కులస్తులు ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో 25 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడి రైతులకు అనుకూలంగా కొల్లాపూర్​లో మామిడి కొనుగోలు మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పినా  చేయలేదు. వీపనగండ్ల పరిధిలోని జూరాల ఆయకట్టు చివరి రైతులకు సింగోటం శ్రీవారి సముద్రం నుంచి  గోపాల్ దిన్నె రిజర్వాయర్ కు లింక్​ ఏర్పాటు చేసి కెనాల్ ద్వారా సాగు నీరందిస్తానన్న హామీ సర్వేలకే పరిమితమైంది. కొల్లాపూర్ మండల పరిధిలోని నల్లమల గ్రామాలకు కేఎల్​ఐ ద్వారా జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీటిని తరలిస్తామని మాట నెరవేర్చలేదు. కొల్లాపూర్ లో 100 బెడ్స్​ హాస్పిటల్​ ఏర్పాటు కాలేదు. సింగోటంలో 30 ఏండ్ల కింద బీరం తండ్రి  కాంట్రాక్టర్​గా బ్రిడ్జి నిర్మించగా..పెండింగ్ ​బిల్లుల పేరుతో మూడేండ్ల కింద రూ.5 లక్షలకు గాను ప్రభుత్వం నుంచి రూ.26  కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంతో వణ్యప్రాణులకు హాని కలుగుతుందని గ్రీన్ ట్రిబ్యునల్​లో కేసు వేసిన బీరం..బీఆర్​ఎస్​లో చేరిన తర్వాత కేసు వెనక్కి తీసుకోవడం వెనక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. 

16 ఎన్నికల్లో 9 సార్లు గెలిచిన కాంగ్రెస్..​

కొల్లాపూర్​ ప్రాంతానికి మొదటి నుంచి కాంగ్రెస్ బెల్ట్​గా పేరుంది. అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా అధికార పార్టీతో పాటు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను పరిశీలిస్తే కాంగ్రెస్​ వైపే మొగ్గు కనిపిస్తోంది. 15 రోజుల క్రితం కొల్లాపూర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకాగా, ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్​ మీటింగ్​లో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. డబ్బులిచ్చినా కేసీఆర్​ సభకు జనాలు రాలేదని, తరలించడంలో స్థానిక  లీడర్లు విఫలమయ్యారన్న ప్రచారం జరి గింది. 2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన మాజీ  మంత్రి జూపల్లి ఇప్పుడు కాంగ్రెస్​ అభ్యర్థిగా రంగంలో ఉంటే.. అప్పుడు కాంగ్రెస్​ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరిన బీరం ప్రస్తుతం బీఆర్ఎస్​ క్యాండిడేట్​గా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గతంలోనూ  ఎల్లేని సుధాకర్​రావు బరిలో నిలవగా ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు.    

ఎవరి ధీమా వారిది...

ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా పథకాలు గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్​అభ్యర్థి బీరం హర్షవర్ధన్​ రెడ్డి కాన్ఫిడెంట్​గా ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, మండలాల డెవలప్​మెంట్​కు సీఎం నుంచి మంజూరు చేయించుకున్న రూ.100 కోట్ల ఎస్డీఎఫ్​పనులు ఆదుకుంటాయని భరోసాతో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, పరిహారం చెల్లింపు, పునరావాస సమస్య, స్థానిక సమస్యలు బీఆర్ఎస్​ను దెబ్బ కొడతాయని, తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు గిరిజనులు, ముస్లింలు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, మధ్య తరగతి వర్గాలు, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్​తో తాను ఈజీగా గెలుస్తానని జూపల్లి ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్​ రావు కల్వకుర్తి–-నంద్యాల హైవే, సిద్దేశ్వరం-–సోమశిల వంతెన నిర్మాణానికి నిధులు సాధించి పనులు మొదలయ్యేలా చూశానని చెప్పుకుంటున్నారు. నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ ఇప్పించడంతో పాటు, షెల్టర్​ ఇవ్వడం, ప్రతి గ్రామానికి బీజేపీని తీసుకుపోవడంలో సక్సెస్​ అయ్యారు. కేంద్ర పథకాలు, ఎస్సీల వర్గీకరణకు మద్దతు, మోదీ చరిష్మా తనను గెలిపిస్తాయంటున్నారు. 

బర్రెలక్క సంచలనం..

శిరీష అలియాస్ బర్రెలక్క..కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తర్వాత పరిచయంతో పని లేకుండా సంచలనంగా మారింది. డిగ్రీ వరకు చదువుకున్న బర్రెలక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసింది. రెండు సార్లు గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యింది. సామాన్య దళిత కుటుంబ నేపథ్యం, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కోరికతో ఆమె తనకున్న నాలుగు బర్రెలు అమ్ముకుని హైదరాబాద్​లో కోచింగ్ తీసుకుంది. కానిస్టేబుల్ పరీక్ష రాసి పాసైంది. సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు వెళ్లాల్సి ఉండగా, అంతకుముందు బర్రెలతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని సర్కారు కేసు పెట్టి అనర్హురాలిని చేసింది. దీంతో తనలాగే కష్టాలు పడుతున్న నిరుద్యోగుల కోసం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. శిరీషకు ఊరి సమస్యలు, కొల్లాపూర్ ప్రజల కష్టాలు, నిరుద్యోగుల సమస్య మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆమె గురించి తెలుసుకున్న  సెలబ్రిటీలు, మేధావులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు పలుకుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా తరలివస్తున్న వారితో శిరీష ప్రచారం ఒక రేంజ్​కు చేరింది. క్యాంపెయిన్​లో మామిడి రైతులు, చేపలు పట్టేవారి లైఫ్ స్టైల్, ఇబ్బందులు, సర్కారు స్కూల్స్, కాలేజీల సమస్యలు, నిరుద్యోగులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరును  తూర్పారబడుతోంది. అన్ని వర్గాల మద్దతుతో తాను గెలిచి తీరతానని నమ్మకంగా చెప్తోంది.