ఇళ్లను దోచేసే దొంగ అరెస్ట్.. 16 తులాల బంగారం స్వాధీనం

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగాధర్ అనే గజ దొంగను మల్కాజిగిరి పోలీసులు, ఘట్ కేసర్ ఎస్ఓటీ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా మే 25వ తేదీ గురువారం ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన మల్కజగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్ వివరాలు వెల్లడించారు.

నిందితుని నుండి రూ.13.5 లక్షల విలువ గల16.5 తులాల బంగారు ఆభరణాలు, 3.48లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంగాధర్ పై గతంలో 42 కేసులు ఉన్నాయని అన్నారు. తాళాలు ఉన్న ఇంటిని రెక్కీ చేసి ఐరన్ రాడ్ తో పగలకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నాడని డీసీపీ చెప్పారు. చిన్నతనం నుండి జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని డీసీపీ అన్నారు. ఈ మేరకు నిందుతుడిని రిమాండ్ కి తరలించారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులును డీసీపీ గిరిధర్ రివార్డుతో అభినందించారు.