పెద్దపులి, అడవిదున్న వరంగల్‌‌కు వస్తున్నయ్‌‌

వరంగల్‍, వెలుగు : వరంగల్‌‌ నగరంలోని కాకతీయ జూపార్క్‌‌కు సరికొత్త కళ రానుంది. ఏండ్ల తరబడి కలగానే మిగిలిన పెద్దపులి, అడవి దున్నలు, జింకలు మరో నెలన్నర రోజుల్లో ఈ జూకు రానున్నాయి. సమైక్య పాలనలో, పదేళ్ల బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో బడ్జెట్‌‌ లేదన్న సాకుతో ఈ జూపార్క్‌‌ను పట్టించుకోలేదు. ప్రస్తుతం జిల్లాకు చెందిన, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది.

40 ఏండ్ల కింద 48 ఎకరాల్లో నిర్మాణం

1985లో అప్పటి గవర్నర్ శంకర్‍దయాళ్‌‌శర్మ చేతుల మీదుగా హనుమకొండ హంటర్‌‌ రోడ్డులో 48 ఎకరాల్లో కాకతీయ జాపార్క్‌‌ను ప్రారంభించారు. హైదరాబాద్‍ తర్వాత అంతే ప్రాధాన్యం కలిగిన ఈ జూపార్క్‌‌కు ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంగనర్‍ జిల్లాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ జూ అభివృద్ధికి గత పాలకులెవరూ ఇంట్రస్ట్‌‌ చూపలేదు. 2014 జనవరిలో ‘స్మాల్‌‌ జూ’ కేటగిరిలో గుర్తింపు పొందింది. ఏడున్నర లక్షల జనాభా ఉన్న వరంగల్‍ ట్రైసిటీలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జూను సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్‌‌ సర్కార్‌‌ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఈ జూ పార్క్‌‌లో గుడ్డేలుగు, మొసళ్లు, జింకలు, నెమళ్లు, చిలుకలతో పాటు గతేడాది తీసుకొచ్చిన చిరుతలు తప్పించి చెప్పకోదగిన వన్యప్రాణులేవీ లేవు. 

గతంలో నిధులివ్వని సర్కార్‌‌

కాకతీయ జూపార్కుకు పెద్దపులి, అడవి దున్నలు తీసుకురానున్నట్లు ఐదేండ్ల కిందే ఎమ్మెల్యేలు, అధికారులు ప్రకటించారు. వరంగల్‌‌ స్మార్ట్‌‌ సిటీగా ఎంపికైన నేపథ్యంలో జూ అభివృద్ధి కోసం ఫండ్స్‌‌ కేటాయించనున్నట్లు చెప్పారు. స్మార్ట్‌‌ సిటీ బృందం సైతం ఈ జూ సందర్శించింది. అవసరమైన ప్రపోజల్స్‌‌ చేస్తున్నామని, ఇక నిధులు రావడమే ఆలస్యమని చెప్పారు. పెద్ద పులి కోసం ఎన్‌‌క్లోజర్‌‌ పనులు సైతం మొదలుపెట్టారు. ఒక్కో ప్రాణికి రూ. కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గుర్తుకొచ్చినప్పుడల్లా పనులు చేస్తూ రెండేండ్ల పాటు సాగదీశారు. ఆ తర్వాత బడ్జెట్‌‌ ఇవ్వట్లేదన్న పేరుతో జంతువులను తీసుకురాలేదు. దీంతో పెద్దపులి కోసం ఏర్పాటు చేస్తున్న ఎన్‌‌క్లోజర్‌‌ పనులను మధ్యలోనే ఆపేశారు. 

వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు మంత్రి చొరవ

ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు చెందిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్‌‌ జూపార్క్‌‌ అభివృద్ధిపై చొరవ చూపారు. కాకతీయ జూలోకి పెద్దపులి, అడవిదున్నతో పాటు అదనంగా జంతువులను తీసుకురావాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో చీఫ్‌‌ వైల్డ్‌‌ లైఫ్‌‌ వార్డెన్‌‌ ఎంసీ. పర్గేయిన్‌‌, చీఫ్ కన్జర్వేటర్‌‌ భీమానాయక్‌‌, వరంగల్ డీఎఫ్‌‌వో భుక్యా లావణ్యతో కూడిన టీం శనివారం కాకతీయ జూపార్క్‌‌ని సందర్శించారు. పెద్దపులి, అడవిదున్నతో పాటు హాగ్‌‌ డీర్‌‌, బార్కింగ్‌‌ డీర్‌‌ను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ జంతువులు ఏప్రిల్‌‌ 1 నుంచి సందర్శనకు ఉంటాయని ప్రకటించారు.