వరంగల్ జూపార్కుకు పెద్దపులులు.. మంత్రి సురేఖ చొరవతో జూకు కొత్త కళ

వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ జూ పార్కుకు పెద్దపులులు వస్తున్నాయి. మరో వారం, పది రోజుల్లో  తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అడవి దున్న, మరో రెండు జింకలు కూడా రానుండడంతో పార్కుకు కొత్త కళ రానుంది. రాష్ట్రంలో హైదరాబాద్ జూ పార్క్ తర్వాత కాకతీయ జూపార్కు రెండో అతిపెద్దది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం, కరీంగనగర్, నల్గొండ జిల్లాల నుంచి పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు  పదేండ్ల స్వరాష్ట్రంలో జూ పార్కు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.  ప్రస్తుతం జిల్లాకు చెందిన దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఓరుగల్లు వాసుల ఎన్నో ఏండ్ల కల తీరనుంది. 

1985లో మినీ జూగా ప్రారంభం 

1985లో ఆనాటి రాష్ట్ర గవర్నర్ శంకర్ దయాళ్​శర్మ  హనుమకొండ హంటర్ రోడ్‎లో దాదాపు 48 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన జూ పార్కును ప్రారంభించారు. ఇది 2014 జనవరిలో ‘స్మాల్ జూ’ కేటగిరిలో గుర్తింపు పొందింది. అనంతరం జూపార్కు అభివృద్ధికి అడుగులు పడలేదు. గుడ్డేలుగు, మొసళ్లు, జింకలు, చిరుతలు తప్పించి చెప్పకోదగ్గ వన్యప్రాణులు లేవు. దీంతో జూపార్కును సందర్శించే పర్యాటకులు తగ్గిపోయారు.  

బడ్జెట్ రావట్లేదంటూ..  

ఐదేండ్ల కిందటే జూపార్కుకు పెద్దపులులు, అడవి దున్నలు రావాల్సి ఉండగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోలేదు. అయితే.. వరంగల్ స్మార్ట్ సిటీగా ఎంపిక వడంతో జూపార్కు అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. అనంతరం పెద్ద పులి కోసం ఎన్ క్లోజర్ల పనులు మొదలుపెట్టారు. ఆపై వదిలేశారు. జూ పార్కుకు రావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదనే పేరుతో కాలయాపన చేశారు.  

రూ.70 లక్షలతో పనులు

మంత్రి కొండా సురేఖ కాకతీయ జూ పార్కులోని సౌకర్యాలపై దృష్టిసారించారు. పర్యాటకుల ఆకర్షణతో పాటు సౌకర్యాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తలో ఉన్నతాధికారులు జూపార్కుని సందర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు పెద్దపులి, అడవిదున్నతో పాటు మరో రెండు రకాలైన హాగ్డీర్, బార్కింగ్డీర్ జింకలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రూ.70 లక్షలతో కొన్ని నెలలుగా పెద్దపులుల కోసం ఎన్ క్లోజర్ల నిర్మాణాలు చేస్తుండగా చివరి దశకు చేరినట్టు జూ అధికారులు తెలిపారు.