తిండి కోసమా..తోడు కోసమా .. ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్దపులుల సంచారం

తిండి కోసమా..తోడు కోసమా .. ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్దపులుల సంచారం
  • గోదారి తీరం వెంట రోజుకు 40 కిలోమీటర్ల జర్నీ
  • ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని ప్రజల్లో ఆందోళన

 హైదరాబాద్, వెలుగు: కొన్ని రోజులుగా గోదావరి తీరం వెంట పెద్ద పులుల సంచారం ఇటు అటవీశాఖ అధికారులు .. అటు పోలీస్​ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  మరోవైపు అవి ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్​ చేస్తాయోనని ప్రజలు అందోళన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలోకి మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ అడవుల నుంచి పెద్ద పులులు తరచూ రాకపోకలు కొనసాగిస్తున్నాయి.  ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్​తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులుల అడుగు జాడలు కనిపించాయి.తడోబా, తిప్పేశ్వరం, కదంబా అభయారణ్యం నుంచి పులులు వస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. 

కాగజ్ నగర్ కు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం సమీపంలో ఉండడం.. ఇక్కడ పులుల ఆవాసానికి అనువైన వాతావరణం ఉండడంతో  ఎక్కువ సంచరిస్తున్నాయి.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  దాదాపు 8  పెద్ద పులులు తిరుగుతున్నట్టు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. తాజాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పెద్ద పులులు సంచరిస్తున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఇటీవల ములుగు అడవుల్లో పులి కనిపించగా.. తాజాగా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని ఒర్రి నర్సయ్యపల్లిలో మరోసారి పులి సంచారం కలకలం సృష్టించింది.  ఈ పులి.. ఆ పులి ఒక్కటేనా? లేక రెండు పులులా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.  ఇప్పటికే అటు ఫారెస్ట్, ఇటు పోలీస్ అధికారులు  పులి కోసం వెతుకులాట ప్రారంభించారు.  

15 రోజుల తర్వాత ప్రత్యక్షం 

 రెండు వారాల క్రితం ములుగు అటవీ ప్రాంతంలో ఓ పులి సంచరించింది.  తర్వాత దాని జాడ కనిపించలేదు. మళ్లీ తాజాగా రుద్రగూడెం సమీపంలో పులి ప్రత్యక్ష్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది.  ఇప్పటికే అటవీశాఖ అధికారులు, పోలీసులు.. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.  పంట చేనులో  అడుగుల ఆధారంగా మగ పులిగా గుర్తించారు. ఈ పులి చత్తీస్​గఢ్ అడవుల నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు.  మరి చత్తీస్ గఢ్ అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోయి..  వాటి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా  కొత్త ఆవాసం కోసం వెతుకులాట ప్రారంభించిందా? లేదా అక్కడ ఆహారం దొరక్కపోవడంతో వేట కోసం బయలు దేరిందా? పులులకు మేటింగ్ సమయం కావడంతో ఆడతోడు  కోసం అన్వేషిస్తున్నదా? అనేది  అంతుచిక్కడం లేదు.  

కాగా, అటవీశాఖ అధికారులు  పులి ఎటు వైపు వెళ్తుంది? ఎక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది? అనే దానిపై నిఘా పెట్టారు.  సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాక్ చేస్తున్నారు. అయితే, ఇక్కడికి వచ్చిన పులి  స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా? లేదా తిరిగి వెళ్తుపోతుందా? అనేది  ఇప్పడే చెప్పలేమని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పులి ఆవాసం కోసం ఆరాటపడుతున్నదని, దానికి సరైన ఆవాసం లేకుంటే తిరిగి స్వస్థలానికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.  

కాగా, రెండేండ్ల క్రితం తాడ్వాయి మండలంలోని అడవులకు వచ్చిన పులి ఇదే లింగాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు బలైంది.  అయితే, ఈ పులి కూడా వేటగాళ్ల ఉచ్చుకు బలి అవుతుందా? లేదా సురక్షితంగా తన ప్రాంతానికి వెళ్తుందా? అనేదానిపై అధికారుల్లో టెన్షన్ నెలకొన్నది. ప్రస్తుతం వేటగాళ్ల నుంచి  పులికి.. అటు పులి నుంచి ప్రజలకు హాని కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా ఏర్పడి పులి అడుగు జాడలు కనిపెట్టే పనిలో పడ్డారు.  పులి సంచరించే సమీప గ్రామాల్లో చాటింపు వేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

రిట్రీట్ అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలి 

నల్లబెల్లి, కొత్తగూడ మండలాల్లో పులి సంచరించగా.. వాటి పాదముద్రలను పరిశీలించిన  ఫారెస్టు ఆఫీసర్లు  మగపులిగా నిర్ధారించారు. ములుగు, తాడ్వాయి అటవీ ప్రాంతాల మీదుగా నల్లబెల్లి మండలంలోని కొండాపుర్, రుద్రగూడెం గ్రామాల్లో  పులి సంచరించింది. పంట పొలాల్లో తిరుగుతూ గాడ్రించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శనివారం వల్లె నర్సయ్య పల్లెలో పులి సంచరించిందనే ప్రచారం జరిగింది. దీంతో డీఎఫ్ వో సృజన, నర్సంపేట ఏసీపీ కిరణ్​ కుమార్, ఎఫ్ఆర్వో రవికిరణ్, సీఐలు, ఎస్సైలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు రుద్రగూడెంలోని పులి సంచరించిన పంట పొలాలను పరిశీలించారు. పులి తోడు కోసమో? లేదా ఆవాసం కోసమో? తిరుగుతుందని, రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోయే చాన్స్ ఉందని అంటున్నారు.

కాగా, పులి రోజుకు 35 నుంచి 40 కిలో మీటర్లు ప్రయాణం సాగిస్తున్నదని, ఒకసారి వేటాడితే దాదాపు 4 రోజుల వరకు తినకుండా ఉండగలదని చెబుతున్నారు. మేటింగ్ కోసం తిరుగుతున్న సమయంలో ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడితే పులి దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అడవి ప్రాంతంలో సంచరిస్తున్నందున సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని రేంజ్ ఆఫీసర్ వజహత్ పేర్కొన్నారు. నర్సంపేట,కొత్తగూడ రేంజి సరిహద్దు గ్రామాలైన అదిలక్ష్మీపురం, తిమ్మాపూర్, కోనాపురం గ్రామాల్లో డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించారు.

ఒకటా..? రెండా..? 

నల్లబెల్లి మండలం  రుద్రగూడెం శివారు పంట చేలో పులి అడుగులు జాడలను ఫారెస్ట్ అధికారులు  గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఆదిలక్ష్మీపురం లో  పులి సంచరిస్తున్నదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ నుంచి వచ్చింది రెండు పులులా..? ఒక పులా ..? అనేదానిపై స్పష్టత లేదు.  రెండు మగ పులులు సంచరిస్తున్నాయని మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చలికాలం కావడంతో ఆడ పులుల తోడు కోసం అన్వేషణ మొదలు పెట్టాయా?  లేదా ఆవాసం కోసం ఆరాట పడుతున్నాయా? అనేది తేల్చలేకపోతున్నారు. కాగా,  పులి సంచరిస్తున్న సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. 

గోదారి తీరం వెంట ప్రయాణం

కొద్ది రోజుల క్రితం చత్తీస్​గఢ్​ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. చత్తీస్​గఢ్​ అడవుల నుంచి గోదావరి తీరం వెంట ములుగు జిల్లాలోకి ప్రవేశించినట్టు తెలుస్తున్నది. ఆలుబాక, బోధపురం గ్రామ పరిసర ప్రాంతం నుంచి గోదావరి దాటి మంగపేట చుంచుపల్లి మీదుగా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుట్ట వైపు వెళ్లినట్టు పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గుర్తించారు. 

పులి ఏ గమ్యం వైపు వెళ్తుందో గుర్తించిన అటవీశాఖ అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మంగపేట, తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్న పులి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అడవుల్లోకి ప్రవేశించినట్టు తెలిసింది. ఆ తర్వాత పులి ఏమైందో ఎవరికీ తెలియలేదు. తన సొంత ప్లేస్ కు వెళ్లిందని భావించారు. ఈ క్రమంలోనే రుద్రగూడెంలో ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.