
సంగారెడ్డి: అమీన్ పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగా భర్త, పిల్లలని చంపేయాలని రజిత(45) ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 10th క్లాస్ విద్యార్థుల ‘గెట్ టూ గెదర్’ పార్టీలో స్నేహితుడితో రజితకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ప్రియుడితో కలిసి ఉండాలని రజిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.
మార్చి 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషం కలిపి రజిత పిల్లలకు తినిపించింది. భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో నిందితురాలు పిల్లలకు విషం కలిపిన ఆ పెరుగన్నం పెట్టింది. ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08) విగతజీవులుగా పడి ఉన్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో భర్త చెన్నయ్య ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట భర్త చెన్నయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో రజిత బాగోతం బయటపడింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్లావణ్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామం కాగా అమీన్పూర్కు వచ్చి వాటర్ ట్యాంకర్నడుపుకుంటున్నాడు. లావణ్య స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మార్చి 27 (గురువారం) రాత్రి చెన్నయ్య.. పిల్లలు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్(8), భార్య లావణ్యతో కలిసి భోజనం చేశాడు.
భార్య, పిల్లలు పెరుగన్నం తిన్నారని, తాను మాత్రం పప్పుతో తిని చందానగర్కు వాటర్ ట్యాంకర్తీసుకెళ్లినట్టు చెన్నయ్య తెలిపాడు. పని ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చి పడుకున్నానని చెప్పాడు. అయితే, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన భార్య లావణ్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని, వెంటనే పొరుగు వారి సహకారంతో బీరంగూడలోని ఓ హాస్పిటల్కు తరలించానని పోలీసులకు తెలిపాడు. అనంతరం పిల్లలను పరిశీలించగా వారు విగత జీవులుగా పడి ఉన్నారని, లేపి చూడగా అప్పటికే చనిపోయారని చెప్పాడు.