
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోన్న బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్లు చేస్తోన్న సెలబ్రెటీలపై ఇప్పటికే పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే 11 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు. వీరికి నోటీసులు జారీ చేసి.. విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ తరుణంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ.. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై విచారిస్తోన్నట్లు తెలిసింది.
ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తెలియక చేశారు: శేఖర్ భాషా
మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోన్న ఈడీ.. పోలీసులు కేసు నమోదు చేసిన 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోన్నట్లు టాక్. ఈడీ ఎంట్రీతో ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది.
కాగా, బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్న 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.