జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ బామ్మర్ది ఫోన్ సీజ్

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ బామ్మర్ది ఫోన్ సీజ్

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో కాకరేపిన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల మొబైల్ ఫోన్‎ను మోకిల పోలీసులు సీజ్ చేశారు. మరో నిందితుడు విజయ్ మద్దూరి హాస్పిటల్‎లో చికిత్స పొందుతున్నాడని అతడి తరుపు న్యాయవాదుల పోలీసులకు తెలిపారు. కాంటినెంటల్ హాస్పిటల్‎లో విజయ్ మద్దూరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని.. అందుకే విచారణకు హాజరుకాలేదని పోలీసులకు వివరించారు. 

కాగా, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విచారణ ముగిసింది. 2024, అక్టోబర్ 30న దాదాపు 8 గంటల పాటు రాజ్ పాకాలపై మోకిల పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని ఆదేశించారు. విచారణ మధ్యలో రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌస్‎కు తీసుకువెళ్లారు. సుమారు గంట పాటు ఫాంహౌస్‎లో సోదాలు చేశారు.

ALSO READ | జన్వాడ ఫామ్ హౌస్ కేసు: రాజ్ పాకాలను 8 గంటలు విచారించిన పోలీసులు

రాజ్ పాకాల విచారణ మొత్తం ఈ కేసులో మరో నిందితుడు విజయ్ మద్దూరి ఫోన్ చూట్టూ తిరిగినట్లు సమాచారం. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ పాకాలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో ఫామ్ హౌస్‎లో జరిగిన పార్టీలు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై పోలీసులు రాజ్ పాకాలను ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా రాజ్ పాకాల స్టేట్మెంట్‎ను పోలీసులు రికార్డ్ చేశారు. 

కాగా, జన్వాడలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్‎లో నిర్వహించిన పార్టీపై మోకిల పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసుల అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం.. ఎక్సైజ్ నిబంధనలు పాటించకుండా పార్టీలో ఫారెన్ లిక్కర్ సరఫరా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఏ1, విజయ్ మద్దూరిని ఏ2గా పోలీసులు చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు.. తాజాగా ఇవాళ రాజ్ పాకాలను ప్రశ్నించారు.