మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్‎ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభాష్ బెయిల్ కోసం నకిలీ షూరిటీలు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఫేక్ షూరిటీలు సమర్పించిన ముగ్గురిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 

కాగా, 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను మరో సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మారుతిరావు.. సుపారీ గ్యాంగ్ సాయంతో ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. బీహార్‎కు చెందిన సుభాష్ శర్మ అనే వ్కక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. 

తన భార్య అమృత గర్భవతి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న సుభాష్ ప్రణయ్‎ను అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. అమృత, ఆమె తల్లి ముందే ప్రణయ్‎ను చంపేశారు. ఈ పరువు హత్య అప్పట్లో దేశంలో సంచలనం రేపింది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్, అమృత తండ్రి మారుతిరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మారుతిరావు, ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్‎పై విడుదల అయ్యారు. బెయిల్‎పై బయటకు వచ్చిన మారుతిరావు హైదరాబాద్‎లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.