నిజాం షుగర్ ఫ్యాక్టరీ వివాదంలో మరో ట్విస్ట్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ మరో ట్విస్ట్ నెలకొంది.  షుగర్ ఫ్యాక్టరీ భూములు అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.  దక్కన్ షుగర్ యాజమాన్యానికి అప్పులున్నాయని, వాటికి తీర్చేందుకు ఫ్యాక్టరీ భూములు అమ్మాలని యాజమాన్యం నిర్ణయించింది.  యాజమాన్యానికి  మద్దతు తెలుపుతూ రాష్ట్ర సర్కారు కూడా ఒప్పందానికి వచ్చింది.  దక్కన్ షుగర్స్ , ప్రభుత్వం జాయింట్ వెంచర్ గా ఉండటంతో ఇరు పక్షాలు సుప్రీంకోర్టులో భూములు అమ్మేందుకు పిటిషన్ వేశాయి.  దీంతో  దక్కన్ షుగర్స్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.  

1937లో హైదరాబాద్ ఏడవ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో దాదాపు 15వేల ఎకరాల్లో ఈ కర్మాగారం నిర్మించబడింది. సుమారు 80 సంవత్సరాల క్రితం నిజాంలు స్థాపించిన ఈ కర్మాగారం మంచి లాభాలను ఆర్జించింది. 2002లో ఈ కర్మాగారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు ప్రైవేటీకరించడంతో  భారీ నష్టాలకు గురైంది. తరువాత వై.యస్. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక కర్మాగారాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేశారు. అయితే, రాజశేఖరరెడ్డి మరణం కారణంగా ఆ సిఫారసు అమలు కాలేదు. ఇక  2014లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చింది.