చంపలే.. ఆయనే చనిపోయాడు.. రెడ్యానాయక్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

చంపలే.. ఆయనే చనిపోయాడు.. రెడ్యానాయక్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ జిల్లా రేంజల్‌‌‌‌ మండలంలో పోలీస్‌‌‌‌ కస్టడీలో ఉన్న రెడ్యానాయక్‌‌‌‌ మృతి ఘటన కొత్త మలుపు తిరిగింది. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె బంధువులు దాడి చేయడం వల్లే రెడ్యానాయక్‌‌‌‌ చనిపోయాడని ఇన్ని రోజులుగా పోలీసులు చెబుతుండగా.. అతడు స్టేషన్‌‌‌‌లోనే సూసైడ్‌‌‌‌ చేసుకున్నాడని తాజాగా బయటపడింది. వీరన్నగుట్ట తండాకు చెందిన రెడ్యానాయక్‌‌‌‌ గ్రామంలో కిరాణషాప్‌‌‌‌ నడుపుతున్నాడు. ఈ నెల 12న రాత్రి షాప్‌‌‌‌కు వచ్చిన పదేండ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. 

100కు ఫిర్యాదు చేయడంతో రెంజల్‌‌‌‌ పోలీసులు వచ్చి రెడ్యానాయక్‌‌‌‌ను స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లారు. తర్వాత నిజామాబాద్‌‌‌‌ జీజీహెచ్‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించి 13వ తేదీ తెల్లవారుజామున స్టేషన్‌‌‌‌కు తీసుకొచ్చారు. కాపలాగా ఉన్న వాచ్‌‌‌‌ పీసీ ప్రసాద్‌‌‌‌ ఉదయం 5 గంటలకు చూసేసరికి రెడ్యానాయక్‌‌‌‌ అచేతనంగా పడి ఉండడంతో ఎస్సై సాయన్నకు, సీఐ విజయ్‌‌‌‌బాబు, ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. ఉదయం 6 గంటలకు రెడ్యానాయక్‌‌‌‌ను అంబులెన్స్‌‌‌‌లో జీజీహెచ్‌‌‌‌కు తీసుకురావడంతో అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

తమ మీదకు రాకుండా...

కస్టడీలో ఉన్న రెడ్యానాయక్‌‌‌‌ చనిపోయాడన్న సంగతి బయటకు తెలిస్తే తమకు సమస్య అవుతుందని భావించిన పోలీసులు బాలిక తరఫు బంధువుల దాడి కారణంగా గాయపడి చనిపోయినట్లు కేసు నమోదు చేశారు. తర్వాత 13వ తేదీ ఉదయం సుమారు 60 మంది పోలీసులు తండాకు వచ్చి రెడ్యానాయక్‌‌‌‌పై దాడి చేసిన 12 మందిని స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లారు. రెడ్యానాయక్‌‌‌‌ భార్య రాథోడ్‌‌‌‌ లక్ష్మీతో సైతం ఇదే రకంగా కంప్లైంట్‌‌‌‌ తీసుకున్నారు. 

 సూసైడ్‌‌‌‌గా తేలడంతో దిద్దుబాటు చర్యలు

రెడ్యానాయక్‌‌‌‌ 13వ తేదీ ఉదయం చనిపోతే 14వ తేదీ సాయంత్రం జిల్లా అడిషనల్‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌ ఖుష్బూ ఉపాధ్యాయ్‌‌‌‌ సమక్షంలో వీడియో రికార్డింగ్‌‌‌‌ మధ్య పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు డెడ్‌‌‌‌బాడీని తండాకు తరలించి కేవలం కుటుంబసభ్యుల మధ్యే అంత్యక్రియలు పూర్తి చేయించారు. అయితే ఉరి వేసుకోవడం వల్లే రెడ్యానాయక్‌‌‌‌ చనిపోయాడని పోస్ట్‌‌‌‌మార్టంలో తేలడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

బాలిక బంధువులు దాడి చేయడం అవమానంగా భావించిన రెడ్యా నాయక్‌‌‌‌ తన నైట్‌‌‌‌ ప్యాంట్‌‌‌‌ నాడాతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ మార్చేశారు. సూసైడ్‌‌‌‌కు ప్రేరేపించారన్న కారణంతో మంగళవారం ఏడుగురిని రిమాండ్‌‌‌‌కు పంపగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. మరో వైపు దాడి చేసిన వారే స్టేషన్‌‌‌‌కు వెళ్లి హత్య చేశారని రెడ్యానాయక్​పెద్ద కొడుకు రవిచంద్‌‌‌‌ ఆరోపిస్తున్నారు.

పోలీసులపై చర్యలు

రెడ్యానాయక్ మృతిపై విచారణ జరిపేందుకు తూఫ్రాన్‌‌‌‌ డీఎస్పీ ఎస్‌‌‌‌.వెంకట్‌‌‌‌రెడ్డిని నియమించారు. దీంతో ఆయన 14న స్టేషన్‌‌‌‌కు వచ్చి ఎంక్వైరీ చేశారు. రెడ్యానాయక్‌‌‌‌కు కాపలా ఉన్న వాచ్​పీసీ ప్రసాద్‌‌‌‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌‌‌‌ వేటు వేశారు. మరో వైపు ఎస్సై సాయన్నకు, ఆ రోజు డ్యూటీలో ఉన్న హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ లక్ష్మణ్, కానిస్టేబుల్‌‌‌‌ లింబాద్రికి ఉన్నతాధికారులకు మోమో జారీ చేశారు.