ముంబై: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. నిందితుడిని బాంద్రా పీఎస్‌కు తరలించి విచారిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ వ్యక్తిని పోలీసులు బాంద్రా పీఎస్‌కు తీసుకెళ్లిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తే నిందితుడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ కేసుపై ముంబై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. శుక్రవారం (జనవరి 17) ఉదయం బాంద్రా పీఎస్‌కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అనుమానితుడిని విచారించాక.. ఈ దాడితో అతనికి సంబంధం లేదని నిర్ధారించుకుని విడిచిపెట్టామని ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది వీడియోలో ఉన్న వ్యక్తి కాదని పోలీసులు స్పష్టం చేశారు.
ALSO READ | సైఫ్ అలీఖాన్ కేసు : కత్తితో పొడిచినోడు ముంబైలోనే దొరికాడు
కాగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఈ ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించడం గమనార్హం. నిందితుడు కోసం ముంబై పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.