హైదరాబాద్ మహిళ మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. తల్లి మృతదేహం దహన సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు 9 రోజులు శవాన్ని ఇంట్లోనే ఉంచిన ఘటన కలచివేస్తోంది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో మృతురాలి కూతుళ్లు రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సికింద్రాబాద్ వారసిగూడ మహిళ లలిత మృతి కేసులో కూతుళ్లు రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. జనవరి 22న లలిత మృతి చెందగా.. 23 న ఇద్దరు కూతుళ్లు రవలిక, యశ్విత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్ ను వారాసిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ సూసైడ్ కు కారణం మేనమామ బిట్ల రమేష్ , ప్రకాష్ రెడ్డి, తండ్రి సి ఎల్ రాజు అని రవళిక, యశ్విత లేఖలో పేర్కొన్నారు.
సూసైడ్ లెటర్ ప్రకారం మృతురాలు లలిత కుటుంబాన్ని భర్త రాజు దూరం పెట్టాడు. దీంతో లలిత తన కూతుళ్లతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో సోదరుడు బిట్ల రమేష్, అతని భార్య వరలక్ష్మి కలిసి తమ తల్లి లలితను కొట్టినట్లు లెటర్ లో పేర్కొన్నారు. తమ మేనామమ బిట్ల రమేష్ తో 2021 నుండి తమ కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లు లెటర్ లో రాశారు. తమ తల్లిని చంపింది తమ మామయ్య రమేష్ అని లెటర్ లో పేర్కొన్నారు. తమ మామ రమేష్ చేతబడి చేసి చంపాడని, దీనికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని లెటర్ లో పేర్కొన్నారు.
తల్లి మృతితో మానసిక ఒత్తిడికి గురైన రవళిక, యశ్విత సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం జనవరి 23న లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఇక మృతురాలు లలిత మృతదేహానికి శనివారం (ఫిబ్రవరి 1) గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.