నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్‎గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్

హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు  కీలక పురోగతి సాధించారు. అత్యంత దారుణంగా హత్యకు గురైన యువతి, యువకులు ఎవరనేది గుర్తించారు. మృతుడు మధ్యప్రదేశ్‎కు చెందిన అంకిత్ సాకేత్‎ కాగా.. మృతురాలు ఛత్తీస్ గఢ్‎కు చెందిన బిందు (25)గా గుర్తించారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‎కు వచ్చిన అంకిత్.. నానక్ రాంగూడలో ఉంటూ హౌజ్ కీపింగ్‎గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

 బిందు ఎల్బీ నగర్‎లో ఉంటుంది. అంకిత్ సాకేత్‎తో మృతురాలు బిందుకు సన్నిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఈ నెల 8వ తేదీన అంకిత్‌ ఎల్‌బీ నగర్‌ నుంచి బిందును నానక్‎రాంగూడ తీసుకెళ్లి.. అతడి స్నేహితురాలి గదిలో బిందును ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి బిందు, సాకేత్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి..? గుట్టపైకి ఎందుకు వచ్చారు..? ఎలా వచ్చారు..? వీరితో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా లేక ఇద్దరే వచ్చారా..? అన్న కోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు. 

ALSO READ | నార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?

రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి జంట హత్య కేసు చేధించే పనిలో నిమగ్నమయ్యారు. నానక్ రాంగూడ, అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్ట వద్ద అన్నీ రూట్స్‎లో ఉన్న సీసీ ఫుటేజ్ స్పెషల్ టీమ్ పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరనే విషయం తెలియడంతో అసలు ఎలా హత్యకు గురి అయ్యారనేది తెలియాల్సి ఉంది.