పొగిడితే చాలు యాడ్  వచ్చేస్తది

బీహార్​లో ప్రచారానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏటా భారీగా పెరుగుతూ వస్తోంది. 20 ఏళ్ల కిందట ఏడాదికి రూ.5 కోట్లుగా ఉండే యాడ్‌‌ బడ్జెట్‌‌ ఇప్పుడు వంద కోట్లు దాటింది. నితీశ్​ కుమార్​ సీఎం అయ్యాక ఈ బడ్జెట్​ నానాటికీ ఎక్కువైంది. దీన్నిబట్టి న్యూస్​ పేపర్లను, టీవీ చానళ్లను రాష్ట్ర సర్కారు మంచిగానే చూసుకుంటోందనే అభిప్రాయం కలుగుతోంది. కానీ.. యాడ్స్​ ఖర్చు పెంచేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. 20 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు మీడియా సంస్థల సంఖ్య బాగా పెరగటం. రెండోది మీడియాని ప్రభుత్వం చెప్పుచేతల్లో పెట్టుకోవటం.

బీహార్​లోనే కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ​ మీడియాకి యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్య ఆధారం​. న్యూస్​ పేపర్ల​​కైతే సర్క్యులేషన్​ని బట్టే ప్రైవేట్ యాడ్స్​ వస్తాయి. గవర్నమెంట్​ యాడ్స్​ రావాలంటే సర్క్యులేషన్‌‌తో పాటు ఇతర ఇష్యూస్‌‌ కూడా లీడ్‌‌ చేస్తాయి. సర్క్యులేషన్​ పరంగా టాప్‌‌–3లో ఉండే పేపర్లకు యాడ్స్​పరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. వాటికి సర్కారు​ యాడ్స్ దాదాపు అన్నీ వస్తాయి. మిగతా మీడియా సంస్థలకు యాడ్స్​ రాకపోతే కష్టం. దీన్నే నితీశ్​ కుమార్​ ప్రభుత్వం తనకు ప్లస్​గా మార్చుకుంటోందనే టాక్​ వినిపిస్తోంది. వ్యతిరేక వార్తలు​, స్టోరీలు రాసే పేపర్లకు యాడ్స్​ ఇవ్వకుండా తెగ సతాయిస్తోందని ఆయా మీడియా సంస్థల వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం​ పట్ల పబ్లిక్​లో నెగెటివ్​ టాక్​ రాకుండా అడ్డుకోవటానికే సర్కారు ఈ విధంగా న్యూస్​ పేపర్లు, టీవీ చానల్స్​పై ఒత్తిడి తెస్తోందని లోకల్​ మీడియా అంటోంది. అర్హత ఉన్న కొన్ని న్యూస్​ పేపర్లకు యాడ్స్​ ఇవ్వకుండా బెదిరిస్తోందని, మరికొన్నింటికి అర్హత లేకపోయినా ఎక్కువ యాడ్స్​ ఇవ్వటం ద్వారా మచ్చిక చేసుకుంటోందని విమర్శిస్తున్నారు.

నిందితుడి న్యూస్​ పేపర్​కు ఇష్టమొచ్చినట్లు యాడ్స్​

మీడియాపై నితీశ్​​ సర్కారు అన్​డిక్లేర్డ్​ ఎమర్జెన్సీని అమలుచేస్తోందని అపొజిషన్​ మండిపడుతోంది. న్యూస్​  సెన్సారింగ్‌‌ కోసం యాడ్స్​ని ‘తేనె పూసిన కత్తిలా’ వాడుతోందని ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్​డీఏ నాయకత్వంలో 2005లో తొలిసారి సీఎం అయిన నితీశ్.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మూడేళ్ల లోపే యాడ్స్​​ పాలసీని తెచ్చారు. ఆ విధానం ప్రకారం రాష్ట్రంలో కనీసం 45 వేల సర్క్యులేషన్​ ఉన్న హిందీ న్యూస్​ పేపర్లు, 25 వేలు ఉన్న ఇంగ్లిష్​ డైలీలు, 20 వేల సర్క్యులేషన్​ గల ఉర్దూ న్యూస్​ పేపర్లే యాడ్స్​కి ఎలిజిబిలిటీ సాధించాయి.

ఈ గైడ్​లైన్స్​ నేపథ్యంలో తక్కువ సర్క్యులేషన్​ కలిగిన,యాడ్స్​ పొందేందుకు అర్హత లేని న్యూస్​ పేపర్లు సర్కారు వద్ద మార్కులు కొట్టేసే ప్లాన్లకు తెరతీశాయని ఎక్స్​పర్ట్​లు తెలిపారు.   ఆఫీసర్లతో చేతులు కలిపి రూల్స్​కి వ్యతిరేకంగా యాడ్స్ తెచ్చుకునేవాళ్లు. బీహార్​లోని ముజఫర్​పూర్​ నుంచి పబ్లిష్​ అయ్యే ‘ప్రాతహ్​ కమల్​’ డైలీనే దీనికి రీసెంట్​ ఎగ్జాంపుల్​గా చూపారు​.

ఉర్దూ, ఇంగ్లిష్​ భాషల్లో పబ్లిష్​ అయ్యే ఈ న్యూస్​ పేపర్​ సర్క్యులేషన్​ నిజానికి వందల్లోనే ఉంటుంది. కానీ.. 40 వేలకు పైగా ఉన్నట్లు ఆఫీసర్లు ప్రభుత్వ రికార్డుల్లో రాసి, ఏటా రూ.30 లక్షల విలువైన యాడ్స్​ ఇచ్చారు. ఈ పేపర్​ ఓనర్​ బ్రజేష్​ ఠాకూర్​. ముజఫర్​పూర్​ షెల్టర్​ హోమ్​ కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బ్రజేష్​​ ఈ కేసులో బుక్కయిన తర్వాత కూడా ఆయన పేపర్​కి గవర్నమెంట్​ యాడ్స్ వస్తుండటం మీడియా వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో వాళ్లు ‘వడ్డించేవాడు మనోడైతే..’ అనే సామెతను గుర్తుచేసుకుంటున్నారు.

స్కీమ్​లా! స్కామ్​లా!!

పేదరికాన్ని అరికట్టడానికి కష్టపడుతున్న బీహార్​ లాంటి రాష్ట్రంలో ప్రచారానికే రూ.400 కోట్లు ఖర్చు చేయటం సబబేనా అని సోషల్​ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. పేదరికాన్ని పారదోలేందుకు రాష్ట్రానికి ‘స్పెషల్​ స్టేటస్’ ఇచ్చి ఆర్థిక సాయం చేయాలని ఒకవైపు కేంద్రాన్ని కోరుతున్నారు సీఎం నితీశ్​కుమార్​. ఆయనే మరోవైపు ప్రజల సొమ్మును ఇలా వేస్ట్​ చేయటం పద్దతి కాదని సూచిస్తున్నారు. ఈ విమర్శలను అధికార పార్టీ జేడీ(యూ) కొట్టిపారేస్తోంది. ప్రభుత్వ పథకాలనే ప్రచారం చేస్తున్నాం తప్ప పార్టీని కాదని చెప్పుకొస్తోంది.

బీహార్‌‌ ప్రభుత్వం 2018–19లో యాడ్స్​ కోసం 133 కోట్ల 53 లక్షల రూపాయలకు పైగా ఇచ్చింది. ఇందులో న్యూస్​ పేపర్లు, టీవీ చానళ్ల వారీగా దేనికెంత కేటాయించిందో క్లారిటీ ఇవ్వలేదు. ఆ వివరాలు తమ వద్ద ఉండవంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. సర్కారు స్కీమ్​లను జనానికి తెలియజేసేందుకే యాడ్స్​ ఇచ్చినట్లు సమర్థించుకోవటానికి ప్రయత్నించినవాళ్లు అదేదో మరికాస్త వివరంగా వెల్లడిస్తే బాగుంటుంది కదా అని ఆర్టీఐ కార్యకర్తలు అంటున్నారు. స్పందించాల్సింది నితీశ్‌‌  ప్రభుత్వమే.                                                                                                                                                                                                                                       – ‘ది వైర్​’ సౌజన్యంతో      ​