ప్రశాంత్ కిషోర్ పార్టీలో తిరుగుబాటు.. ఇద్దరు కోర్ కమిటీ సభ్యుల రాజీనామా

ప్రశాంత్ కిషోర్ పార్టీలో తిరుగుబాటు.. ఇద్దరు కోర్ కమిటీ సభ్యుల రాజీనామా

పాట్నా: రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా.. నిన్నా మొన్నటి వరకు వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. అవన్నీ వదిలేసి బీహార్ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ‘జన సూరజ్’ పార్టీ పేరుతో రాబోయే బీహార్ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతున్నారు. జన సూరజ్ పార్టీలో ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఇద్దరు రాజీనామా చేశారు. వీళ్లేమీ ఆషామాషీ వాళ్లు కాదు.. మాజీ ఎంపీలు.. అవును.. దేవేంద్ర ప్రసాద్ యాదవ్, మునాజీర్ హసన్ ఇద్దరూ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ చేసే పనులు ఏమీ నచ్చటం లేదని, ఆయన ఒంటెద్దుపోకడలకు పోతున్నారని, ఎవరు ఏం చెప్పినా వినటం లేదని ఆరోపిస్తూ కోర్ కమిటీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ప్రశాంత్ కిషోర్ తీరును ఈ మాజీ ఎంపీలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరూ పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగారు కాబట్టి పీకే పార్టీకి కూడా ఈ మాజీ ఎంపీలు గుడ్ బై చెప్పడం ఖాయమని తేలిపోయింది.

ALSO READ | ప్రియాంక రూటే వేరు.. నిన్న పాలస్తీనా.. ఇవాళ బంగ్లాదేశ్

అక్టోబర్ 2, 2024న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ జన్ సురాజ్ను ప్రకటించారు. 3 వేల కిలోమీటర్లు బీహార్ లో పాదయాత్ర చేసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ వెనుకబాటుతనానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్లంతా కారణమేనని, తాను ఒక ప్రత్యామ్నయంగా బీహార్ను అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ సింబల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోలను పొందుపరిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి బీహార్ లో పెను తుఫాను సృష్టిస్తానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లి కోర్ కమిటీ సభ్యులే రాజీనామా చేయడం బీహార్లో చర్చనీయాంశంగా మారింది.