కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి మండలిలోకి నలుగురు ఎమ్మెల్యేలు..!

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి మండలిలోకి నలుగురు ఎమ్మెల్యేలు..!

పాట్నా: బీహార్‎లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2025, ఫిబ్రవరి 26న బీహార్ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీహార్ రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ బుధవారం (ఫిబ్రవరి 26) తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కేబినెట్ విస్తరణ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.  

ప్రస్తుతం ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ, జేడీయూ కూటమి బీహార్‎లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తాజా కేబినెట్ విస్తరణలో భాగంగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి మండలిలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. మంగళవారం (ఫిబ్రవరి 25) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం నితీష్ కుమార్ చర్చించి కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు. బీహార్ శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య ప్రకారం గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు. 

ప్రస్తుతం నితీష్ మంత్రివర్గంలో 30 మంది మినిస్టర్లు ఉండగా.. మరో ఆరు పోర్టు ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ చేసి.. ఆరుగురిని కేబినెట్‎లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి నలుగురు, జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ హై కమాండ్ కేబినెట్ లోకి తీసుకునే అభ్యర్థుల పేర్లను ఫిక్స్ చేస్తే.. బుధవారం (ఫిబ్రవరి 26) సాయంత్రం మంత్రివర్గ విస్తరణ పూర్తి కానుంది. ప్రస్తుత కేబినెట్‎లో బీజేపీ నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13, ఇద్దరు ఇతరులు మంత్రులుగా ఉన్నారు. 

రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. ‘‘నేను రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నా. ఒక వ్యక్తి, ఒక పదవి అనే బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. బీజేపీ కేంద్ర నాయకత్వం నాకు బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతను ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడను’’ అని పేర్కొన్నారు. 2025,  జనవరి 18న జైస్వాల్‌ను బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్. ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అతడి సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వెల్లడించింది.