IPL 2025: సెంచరీకి దక్కిన బహుమానం.. వైభవ్ సూర్యవంశీకి భారీ నగదు ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి

IPL 2025: సెంచరీకి దక్కిన బహుమానం.. వైభవ్ సూర్యవంశీకి భారీ నగదు ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి

ఐపీఎల్ 2025 లో ఎవరూ ఊహించని అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాడు. సోమవారం (ఏప్రిల్ 28) రాజస్థాన్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్ శివాలెత్తాడు. తన బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ 14 ఏళ్ళ కుర్రాడు ఓవరాల్ గా 38 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.     

వైభవ్ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యం కూడా కరిగిపోయింది. గుజరాత్ ను ఏ దశలో కోలుకోనీయకుండా మ్యాచ్ ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పాడు. సూర్యవంశీ ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 14 ఏళ్ళ వయసులోనే ఇంతటి కీర్తిని అందుకున్న ఈ బీహార్ కుర్రాడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రకటించింది. రికార్డ్ సెంచరీతో ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించిన సూర్యవంశీ ప్రదర్శనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసించారు. సూర్యవంశీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. 

"ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. అతని కృషి , ప్రతిభ ఫలితంగా అతను భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా మారాడు. అందరూ అతని పట్ల గర్వపడుతున్నారు. నేను 2024లో శ్రీ వైభవ్ సూర్యవంశీని.. అతని తండ్రిని కలిశాను. ఆ సమయంలో నేను అతనికి ఉజ్వల భవిష్యత్తును కోరుకున్నాను.

ఐపీఎల్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, నేను ఫోన్‌లో కూడా అతనిని అభినందించాను. బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ప్రైజ్ మనీని కూడా ఇస్తుంది. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కొత్త రికార్డులు సృష్టించి దేశానికి కీర్తి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను". అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చారు.  

సోమవారం (ఏప్రిల్ 28) జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. గుజరాత్ టైటాన్స్ పై 210 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101: 7 ఫోర్లు, 11 సిక్సులు) ఓపెనర్ గా పెను విధ్వంసం సృష్టించడంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి గెలిచింది.