పొరపాటున వారితో పొత్తు పెట్టుకున్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్

పొరపాటున వారితో పొత్తు పెట్టుకున్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్

పట్నా: బిహార్లో జేడీయూతో పొత్తుకు ఆర్జేడీ తలుపులు తెరిచే ఉన్నాయని లాలూ ప్రసాద్ యాదవ్‌‌ ఇచ్చిన ఆఫర్‌‌పై సీఎం నితీశ్ కుమార్ తాజాగా​స్పందించారు. తాను పొరపాటున రెండుసార్లు వారితో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏమీ చేయలేదని చెప్పారు. ఆదివారం నార్త్ బిహార్ జిల్లాలోని ముజఫర్​పూర్​లో విలేకర్లతో నితీశ్ మాట్లాడారు.

‘‘మాకంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేశారు..? వారి పాలనలో జనం సూర్యాస్తమయం తర్వాత ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడేవారు. అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉంది?.. నేను పొరపాటున రెండుసార్లు వారితో పొత్తు పెట్టుకున్నాను. జీవిక పేరుతో స్వయం సహాయక సంఘాలను ఇయ్యాల బిహార్​లో మీరు చూడొచ్చు. ఇంత ఆత్మవిశ్వాసమున్న గ్రామీణ మహిళలను గతంలో మీరు చూశారా?” అని నితీశ్ కుమార్ ప్రశ్నించారు.