పాత ఫోన్లకు టిఫిన్ బాక్సులంటూ.. సైబర్​ వల  

పాత ఫోన్లకు టిఫిన్ బాక్సులంటూ.. సైబర్​ వల  
  • ఊర్లలో అమాయకులకు బిహార్  గ్యాంగ్  గాలం
  • ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్, 2,125 మొబైల్స్  సీజ్ 
  • వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్  మహాజన్

ఆదిలాబాద్, వెలుగు: చిన్న ఫోన్ కు చిన్న టిఫిన్  బాక్స్.. పెద్ద ఫోన్ కు పెద్ద టిఫిన్  బాక్స్​ ఇస్తాం..బ్యాటరీలు లేకున్నా, స్క్రీన్  పగిలిపోయినా.. పని చేయకపోయినా తీసుకుంటామంటూ ఊర్లలో అమాయకులకు గాలం వేస్తూ తిరుగుతున్న బిహార్  గ్యాంగ్ ను ఆదిలాబాద్  పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్  మహాజన్  మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

బిహార్ కు చెందిన ముఠా గిఫ్ట్ లు ఆశచూపి ఫోన్లలోని వ్యక్తిగత డేటా సేకరించి సైబర్  నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్  నేరాలకు పాల్పడడానికి వేసుకున్న ప్లాన్ లో భాగంగా ఏ తబరఖ్  గ్యాంగ్ లీడర్ గా ఉంటూ మిగిలిన ఐదుగురు నిందితులను బిహార్  నుంచి ఐదు బైకులపై రాష్ట్రానికి పంపించాడని తెలిపారు.

ఈ ఐదుగురు బైక్ లపై పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ పాత ఫోన్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు, టిఫిన్  బాక్సులు ఇస్తూ ఫోన్లు, సిమ్  కార్డులు, బ్యాటరీలను సేకరించినట్లు తెలిపారు. సిమ్  కార్డులు, ఫోన్ల ద్వారా బ్యాంక్  అధికారులమని ఫోన్లు చేసి వారి నుంచి డబ్బులు కాజేస్తూ సైబర్  నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ గ్యాంగ్ సేకరించిన 2,125 పాత ఫోన్లు, 107 సిమ్ కార్డులు, 600 బ్యాటరీలు, ఐదు బైక్ లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు కర్నాటక నుంచి 12 వేల ఫోన్లను సేకరించి, వాటి ద్వారా సైబర్  నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.

మహ్మద్ మెర్జుల్, మహాబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్ట్​ చేశామని, ఏ1 తబరఖ్  కోసం ఒక టీమ్​ను బిహార్ కు పంపిస్తున్నట్లు చెప్పారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సైబర్  క్రైం డీఏస్పీ హసిబుల్లా, ఆదిలాబాద్  డీఏస్పీ జీవన్ రెడ్డి, టూటౌన్  ఇన్స్​పెక్టర్  కరుణాకర్ రావు, సీసీఎస్  ఇన్స్​పెక్టర్  చంద్రశేఖర్ ను ఎస్పీ అభినంధించారు.