
2025 అక్టోబర్‌లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. 243 మంది ఎమ్మెల్యేల స్థానాలకు మరో ఆరునెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. బిహార్ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు చాలా కీలక రాష్ట్రం. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ గెలిచినప్పటికీ ఒకవేళ బిహార్‌లో ఓడిపోతే,,శక్తిమంతమైన కమలం పార్టీ ప్రత్యర్థులు పెద్ద రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నారని అర్థం చేసుకోవాలి.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిహార్ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన పొత్తులు మార్చినప్పుడల్లా ఆ కూటమి గెలుస్తోంది. నితీశ్ కుమార్ పొత్తులతో పోటీ చేసినప్పటికీ, ఆయన సొంత పార్టీ జేడీయూకి స్థిరమైన 18% ఓట్లు వస్తున్నాయి. తమిళనాడులో డజన్ల కొద్దీ రాజకీయ పార్టీలు ఉన్నట్లుగానే బిహార్‌లో కూడా ఉన్నాయి. చిన్న పార్టీలు కొన్నిసార్లు ఒక జిల్లాలో మాత్రమే బలం కలిగి ఉన్నప్పటికీ ఆ పార్టీలు గెలపు, ఓటముల మధ్య వ్యత్యాసంపై ప్రభావం చూపుతాయి. బిహార్‌లో బీజేపీ సారథ్యంలోని కూటమి ఒకవైపు మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని కూటమి బలంగా ఉన్నాయి.
భిన్నంగా బిహార్ రాజకీయాలు
బిహార్‌లో బీజేపీ ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ, నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మద్దతు చాలా అవసరం. వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లభించలేదు. బీజేపీ కూటమికి కీలక భాగస్వామిగా జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఉన్నారు.
1989 నుంచి 2005 వరకు లాలూ ప్రసాద్ భార్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదవ్‌లు బిహార్ రాజకీయాలను శాసించారు. కానీ, 2005లో నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాలూ మళ్లీ బిహార్‌లో సొంతంగా అధికారంలోకి రాలేకపోయారు. లాలూ తన యాదవ్ కులంపై, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉన్నాడు. లాలూ తన పార్టీ బలాన్ని విస్తరించలేకపోయాడు. దీంతో నితీష్ కుమార్ లేకుండా లాలూ కూడా బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
2015లో లాలూ కూటమి బిహార్ ఎన్నికల్లో గెలిచింది. కానీ, అప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్‌లో చాలా చిన్న పార్టీలు ఉన్నాయి. అవి తరచుగా కూటములు మారుతాయి. అయితే రెండు కూటముల్లోనూ కీలక పాత్రధారులు మాత్రం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు వ్యవహరిస్తారు.
బిహార్ రాజకీయాల్లో న్యూ ఫ్యాక్టర్స్
నరేంద్ర మోదీ బిహార్‌కు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ అయన బిహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014 నుంచి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిహార్ మోదీకి పెద్ద విజయాలను అందించింది. అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక రాజకీయ నాయకులకు కూడా ప్రభావాన్ని చూపుతారు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఓటర్లలో 10% కంటే ఎక్కువ మంది ఉన్న యాదవ్ ఓటర్లు పూర్తిగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఓటు వేశారు. కానీ ఇప్పుడు, యాదవ్ ఓటర్లు కూడా బీజేపీ కూటమికి ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు కేవలం కులం కంటే పాలన, మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ముస్లింలు నిరంతరం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. కానీ, కొంతమంది ముస్లిం ఓటర్లు మాత్రం నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తున్నారు.
బిహార్‌లో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలుగా లాలూ ప్రసాద్‌కు మిత్రపక్షంగా ఉంది. ఇటీవలే, కాంగ్రెస్ తన పునర్ వైభవాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుందని చాలామంది భావించారు. అయితే అసలు లక్ష్యం అది కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్‌కు తగినంత సీట్లు ఇచ్చేలా చూసుకోవడం, తమ ఉనికిని పెంచుకునే ప్రయత్నం యోచనలో కాంగ్రెస్ ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్థితిలో లేదు. కాగా, భారతదేశాన్ని బీజేపీ పాలిస్తోంది. శక్తిమంతంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే బడ్జెట్ సమయంలోనే బీజేపీ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్ కోసం భారీ మొత్తాలను కూడా వ్యూహాత్మకంగా కేటాయించింది. అంతేకాకుండా, బిహార్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నాయకుడు బీజేపీకి లేడని ఆ పార్టీ అధిష్టానానికి తెలుసు. నితీశ్ కుమార్‌పై పూర్తిగా ఆధారపడవలసి వచ్చింది. ఈక్రమంలో అన్ని చిన్న పార్టీలను కూడా జాగ్రత్తగా బీజేపీ సమకూర్చుకుంది.
లాలూ ప్రసాద్ కూటమి ప్రధానంగా యాదవ్ కులం, కొన్ని వర్గాల బీసీలు, ముస్లిం ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఒక కీలక నాయకుడిగా పేరుగాంచాడు. కానీ, లాలూ ప్రసాద్‌కు అవినీతి ఇమేజ్ ఓ సమస్యగా మారింది. బిహార్ప్రజలు ‘జంగల్‌రాజ్’ను కొంతవరకు మర్చిపోయినా, ఇంకా పూర్తిగా మర్చిపోలేదని బిహార్ రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
బిహార్ కేజ్రీవాల్‌గా ప్రశాంత్ కిషోర్
లాలూ ప్రసాద్ లేదా ఆయన కుటుంబం మళ్ళీ బిహార్‌ను పాలించాలని ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా కోరుకోరు. లాలూ ప్రసాద్ తన కూటమికి నాయకత్వం వహించడానికి వేరే నాయకుడిని ఎంచుకుంటే బిహార్ ఓటర్లు అతనికి విజయాన్ని అందించే అవకాశం ఉంది. కానీ, బిహార్ ఓటర్లు లాలూ యాదవ్ కంటే నితీశ్‌కుమార్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రశాంత్ కిషోర్ తాను బిహార్ కేజ్రీవాల్‌గా మారి గెలవాలని కలలు కంటున్నాడు.
ఢిల్లీ ఒక పెద్ద నగరం, బిహార్ ఒక పెద్ద వెనుకబడిన రాష్ట్రం. ప్రశాంత్ కిషోర్ చిన్న ప్రభావాన్ని చూపినా, అది అతనికి గొప్ప విజయం అవుతుంది. బిహార్ కూడా పాత రాజకీయాల నుండి మార్పును కోరుకుంటుంది. ప్రస్తుతానికి బీజేపీ కూటమి వైపు ప్రజల మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఎన్నికలకు ఆరు నెలలు మిగిలి ఉన్నాయి. దీంతో ముందుగా ఫలితాలను అంచనా వేయడం తొందరపాటు చర్య అవుతుంది. నితీశ్ కుమార్ మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజలు నిజాయితీపరుడైన, అహింసాయుతమైన, వంశపారంపర్యం లేని నాయకుడిని ఇష్టపడ్డారని అర్థం.
ప్రశాంత్ కిషోర్ ప్రభావం చూపగలరా?
ప్రశాంత్ కిషోర్ ఒక ఫేమస్ ఎన్నికల స్పెషలిస్ట్. బిహార్‌లో ఎన్నికలలో పోటీ చేయడానికి అక్టోబర్ 2024లో ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ అనే పార్టీని స్థాపించారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఇప్పుడు బిహార్‌లో విస్తరించి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులు గెలవలేదు. కానీ, కిషోర్ పార్టీ అభ్యర్థులు మెరుగైన ఓట్ల శాతంతో తమ ప్రభావాన్ని ఇతర పార్టీలపై చూపగలిగారు. బిహార్‌లో గత 47 సంవత్సరాలుగా దాదాపు వంశపారంపర్య పాలన కొనసాగుతోంది.
వంశపారంపర్య రాజకీయ నాయకులు లేదా వారి పిల్లలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. అందువల్ల, వారి కుటుంబాలు ఎన్నికై పదవులపై పట్టు కలిగి ఉండటంతో కొత్తగా ప్రవేశించేవారికి చోటు లేదు. ఈనేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించేవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా 243 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తాడు. ఆయన ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. బిహార్ రాజకీయాలు మతాలు, కులాల మధ్య కేంద్రీకృతమైనందున ప్రశాంత్ కిషోర్ పార్టీ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలవడం కష్టం. అయితే, కిషోర్ గణనీయమైన సంఖ్యలో ఓట్లను పొందే అవకాశం ఉంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్-