Bihar Floods : బీహార్​ లో వరద బీభత్సం.. ఆరు బ్యారేజీల కట్టలు తెగాయి

Bihar Floods :  బీహార్​ లో వరద బీభత్సం.. ఆరు బ్యారేజీల కట్టలు తెగాయి

నేపాల్​ వర్షాలు బీహార్​ ను అతలాకుతలం చేస్తున్నాయి.  నేపాల్​ వరద బీహార్ కు చేరింది,  కోసి, బాగ్మతి, గండక్  సహా ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి.  దీంతో సమీప గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ( సెప్టెంబర్​ 30 మధ్యాహ్నం 12 గంటల వరకు) ఆరు బ్యారేజీల కట్టలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. 

నేపాల్​ వరద బీహార్​ లో  సోమవారం ( సెప్టెంబర్​ 30)  ఉగ్రరూపం దాల్చింది.  కోసి ... బాగ్మతి నదుల కట్టలు తెగడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యారు.  ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. దర్భంగ జిల్లాలో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కోసి నది ఉధృతంగా ప్రవహించడంతో .. కర్తార్​ పూర్​ సమీపంలో గండి పడింది.  ఆదివారం ( సెప్టెంబర్​ 29) రాత్రి కిర్తార్​ పూర్​.. ఘన శ్యాంపూర్​ గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. బాగుమతి నది వరద ప్రవాహం పెరడగంతో మర్హి జిల్లాలోని రన్ని సైద్‌పూర్ బ్లాక్‌లోని నది కట్ట తెగింది. 

పరిస్థితి మరింత దిగజారకుండా అధికారులు చర్యలు చేపట్టారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.  ఇప్పటి వరకు  ( సెప్టెంబర్​ 30 మధ్యాహ్నం 12 గంటల వరకు)  ఆరు కట్టలు తెగిపోయానని బీహార్ జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు.   జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDRF) 12బృందాలు..  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(SDRF) 22 బృందాలు సహాయక చర్యలు చేసేందుకు రంగంలకి దిగాయి.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ఉత్తర ప్రదేశ్​ వారణాసి... ఉత్తర బీహార్​.. జార్ఖండ్​ లోని రాంచీలో  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDRF)కి చెందిన మరో బృందాలు అక్కడకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఇండో – నేపాల్‌ సరిహద్దు సమీపంలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.  మౌలిక సదుపాయాలు, వ్యవసాయ భూములుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీహార్‌ రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి.

ఇదిలా ఉంటే  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.  మమల్కా గ్రామంలో  10 ఇళ్లలోని వరద నీరు చేరింది. కొన్ని అపార్ట్​ మెంట్లలో మూడవ అంతస్థులోకి నీరు ప్రవేశించింది. పాట్నా, భాగల్‌పూర్, బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, కతిహార్, ఖగారియా, ముంగేర్  జిల్లల్లో వరద తాకిడికి గురయ్యాయి.  బీహార్ సీ​ఎస్​  ప్రత్యయ అమృత్  12 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. నీరు మరింత పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.  

. పశ్చిమ చంపారన్‌లోని గండక్‌ నది ఉద్ధృతితో వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ముజఫర్‌పూర్‌లోని పవర్‌ గ్రిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ఏ క్షణంలోనైనా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవచ్చని అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. అదే జరిగితే దాదాపు 43 వేల మంది అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.