హైదరాబాద్ చింతల్ బస్తీలో బీహార్ గ్యాంగ్..సిటీ మొత్తానికి వీళ్లే మోమోస్ సరఫరా

హైదరాబాద్ చింతల్ బస్తీలో బీహార్ గ్యాంగ్..సిటీ మొత్తానికి వీళ్లే మోమోస్ సరఫరా
  • కుటుంబంలోని నలుగురికి అస్వస్థత
  • వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్​లో చేరిక
  • రేష్మ మృతదేహాన్ని బయటికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం!
  • మోమోస్ అమ్మిన ఆరుగురిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
  • 110 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్​సిటీ/పంజాగుట్ట, వెలుగు: మోమోస్ విక్రయించిన వారితో పాటు వాటిని తయారు చేసిన వాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వారిలో బిహార్​కు చెందిన అర్మాన్, సాధిక్, రజిక్, అనిఫ్, ముఖ్రం, ఆలం ఉన్నారు. వీరంతా మూడేండ్ల కింద హైదరాబాద్ సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఉంటు న్నారు. 8 నెలల కింద ఖైరతాబాద్​లోని చింతల్​బస్తీకి మకాం మార్చి మోమోస్ తయారు చేయడం ప్రారంభించారు. వాటిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. 

బంజారాహిల్స్​లోని నందినగర్, సింగాడికుంటలో మోమోస్ తిని అస్వస్థతకు గురైన వారి సంఖ్య 97కు చేరింది. శుక్రవారంమోమోస్ తిన్న రేష్మ బేగం..ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయింది. 

మరో 39 మంది అస్వస్థతకు గురై సిటీలోని వివిధ హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి సోమ, మంగళవారం నందినగర్, సింగాడికుంట సర్వే నిర్వహించారు. 214 ఇండ్లను సందర్శించారు. 

మోమోస్ తినడంతో తామూ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు 57 మంది తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 97కు చేరింది. వీరిలో కొందరికి ఓపీలో ట్రీట్​మెంట్ ఇప్పించి న వైద్య శాఖ అధికారులు.. మరికొందరిని దగ్గర్లోని హాస్పిటల్స్​కు తరలించారు. 

అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వాతి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న ఏడుగురిని, తన్వీర్ హాస్పిటల్​లో ఆరుగురిని జీహెచ్​ఎంసీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్ అధికారులు మంగళవారం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.