అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన నిందితుడు మనీష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.వారం క్రితం దోపిడీలు మొదలుపెట్టిన నిందితులు.. ఛత్తీస్‌గఢ్, బీదర్‌లో వరుస దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మనీష్‌పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఇదిలా ఉండగా మనీష్‌పై రూ. 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది బీహార్ ప్రభుత్వం.మనీష్ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలిస్తున్నారు.
తెలంగాణ, బిహార్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 40కి పైగా బృందాలతో మనీష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.నిందితులు సికింద్రాబాద్ మీదుగా తిరుమల గిరికి చేరుకొని అక్కడే బట్టలు, బ్యాగుల మార్చుకొని సుచిత్ర వైపు వెళ్లినట్లు నిర్దారించారు పోలీసులు.కాల్పులు జరిపిన అనంతరం దొంగల ముఠా అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వెళ్లినట్టు గుర్తించారు. ఇందుకోసం నాలుగు ఆటోలను చేంజ్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుసుకున్నారు. తిరుమలగిరి నుంచి చత్తీస్‌గఢ్ వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాల్పుల ఘటనను సీపీ సీవీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సహా మొత్తం 10 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. కర్నాటక, ఏపీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాల్పులు జరిగిన రోషన్ ట్రావెల్స్ పరిసర ప్రాంతాలు, అఫ్జల్‌గంజ్ బస్‌స్టాప్, ఎంజీబీఎస్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను సేకరించారు. నాలుగు ఆటోలు మారుతూ..ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ అక్కడి నుంచి తిరుమలగిరిలోని ట్రావెల్స్కు చేరుకున్నట్టు గుర్తించారు.