కరోనా రిటర్న్స్.. పరీక్షలు పెంచాలంటున్న ప్రభుత్వాలు

దేశంలో కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు పెరుగుతున్న క్రమంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. RT-PCR (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్షలను పెంచాలని అధికారులను ఆదేశించింది. తాజాగా ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, పాట్నా, గయా, దర్భంగా విమానాశ్రయాలలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జెఎన్.1 వేరియంట్‌ కు చెందిన రెండు కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అడిషినల్ చీఫ్ కార్యదర్శి ప్రత్యయ్ అమృత్ తెలిపారు. వారిద్దరూ ఇటీవల ప్రయాణం చేశారని చెప్పారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని అమృత్ తెలిపారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. తప్పనిసరిగా పరీక్షలను పెంచాలని, అన్ని ఆసుపత్రులలో మందులు, పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని కుమార్ సూచించారు. ఆసుపత్రి సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించమని అందరికీ చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.