సీమాకు రెండో కాలు వచ్చేసింది

స్మార్ట్ ఫోన్ యుగంలో సమస్యల పరిష్కారానికి సోషల్ మీడియా ఒక మంచి వేదిక. తప్పు చేసినోడిని బజార్లో నిలబెట్టడమే కాదు...తప్పును ప్రశ్నించినవారిపై ప్రశంసలు కురిపిస్తుంది. పెద్దోడి మనసు కరిగిస్తుంది...పేదోడికి సాయం చేయిస్తుంది.   అందుకే ప్రస్తుతం సోషల్ మీడియా పవర్ ఫుల్ వెపన్ అని చెప్పొచ్చు.

సోషల్ మీడియా సాయం..
ఇదే సోషల్ మీడియా ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టింది. బీహార్ లో ఒంటికాలిపై బడికి వెళ్తున్న బాలిక సీమాకు కొత్త జీవితాన్ని అందించింది. షోషల్ మీడియా పుణ్యమా అని ఆ బాలికకు ఇప్పుడు రెండో కాలు వచ్చేసింది. సీమా ఒంటికాలుపై బడికెళ్లే వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది స్పందించారు. బీహార్ లోని జాముయి జిల్లా కలెక్టర్ అవనీశ్ శరణ్ తన బృందంతో కలిసి ఫతేపూర్ గ్రామానికి వెళ్లారు. సీమాకు ట్రై సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  సీమా వీడియోపై స్పందించిన వైద్యులు..ఆమె కాలును పరిశీలించి..ప్రొస్థెటిక్ కాలును అమర్చారు. ప్రొస్థెటిక్ కాలుతో సీమా నిల్చున్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

దేశాన్నే కదిలించింది..
బీహార్‌ రాష్ట్రంలోని జాముయి జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన 10 ఏళ్ల సీమా.. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆ బాలిక కాలును కోల్పోయింది. కాలును కోల్పోయినా..సీమా మాత్రం ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎలాగైనా చదువుకోవాలన్న సంకల్పంతో... రోజూ ఒంటి కాలుపై స్కూలుకు వెళ్లేది. ప్రస్తుతం సీమా 5వ క్లాస్ చదువుతోంది. తన ఇంటి నుంచి స్కూల్ ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. దీంతో కాలుపై గెంతుతూ పాఠశాలకు వెళ్లొచ్చేది సీమా. బ్యాగ్ వేసుకుని ఒంటి కాలుతో సీమా స్కూల్‌కి వెళ్తున్న సమయంలో కొందరు వీడియో తీసి..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. యావత్ దేశాన్ని  కదిలించింది.

సోనూ సాయం..
సీమా వీడియోను చూసి వెంటనే స్పందించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆమెక సాయం చేస్తానని ప్రకటించారు.దీనికి సంబంధించిన తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ కూడా చేశారు. సీమా ఇకపై నువ్వు ఒక కాలితో కాదు.. రెండు కాళ్లపై పాఠశాలకు వెళ్తావు.  టికెట్‌ పంపుతున్నాను. సీమా రెండు కాళ్లపై నడవడానికి సమయం ఆసన్నమైందని  ట్విట్టర్ లో పేర్కొన్నారు. సోనూసూద్ అన్నట్లుగానే సీమాకు వైద్యులు రెండో కాలును అమర్చారు. 

దటీజ్ సోషల్ మీడియా..
రెండు కాళ్లతో నిల్చున్న సీమాను చూసి యావత్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోంది. దటీజ్ సోషల్ మీడియా పవర్ అంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కామెంట్స్ చేస్తున్నారు. ది పాజిటివ పవర్ ఆఫ్ సోషల్ మీడియా అంటూ ఐపీఎస్ అధికారి, తెలంగాణ షీటీమ్స్, భరోసా సెంటర్స్ ఏడీజీ స్వాతి లక్రా ట్వీట్ చేశారు. ఒక కాలుతో స్కూల్‌కి వెళ్తున్న బాలిక సీమాకు ప్రొస్థెటిక్ కాలు వచ్చేసింది. ఇప్పుడామె  రెండు కాళ్లపై నిల్చుందని ట్వీట్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియా శక్తిని ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ కొనియాడారు. సోషల్ మీడియా ద్వారా సీమాకు సాయం అందడం నిజంగా గర్వకారణమైన విషయమని ట్వీట్ చేశారు.