రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు

రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు

బీహార్ రాష్ట్రం అరారియా జిల్లా ఉద్రిక్తంగా మారింది. ఓ వ్యక్తి తన భార్య చనిపోవటంతో.. 14 ఏళ్ల తన మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్ భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. అతన్ని, అతని మైనర్ భార్యను విచారణ కోసం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. విచారణ సమయంలో ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. వాళ్లిద్దరూ అంటే భర్త, మైనర్ భార్య పోలీస్ స్టేషన్ లో చనిపోయారు. 

కొత్తగా పెళ్లయిన భార్యభర్తలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనే సమాచారం వారి బంధువులు, మిత్రులతోపాటు స్థానిక పెద్దలకు తెలిసింది. దీంతో వారు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త జంట చనిపోయారు అని.. ఆత్మహత్య చేసుకున్నారు అని పోలీసులు అంటుంటే.. కాదు కొట్టి చంపారని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

ఇద్దరి మరణాలపై పోలీసుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవటంతో.. బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ను తగలబెట్టారు. పరిస్థితి అదుపు తప్పటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు వీదుల్లో విధ్వంసానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన స్పాట్ కు వచ్చారు. 

పోలీస్ స్టేషన్ లో కొత్త దంపతుల మరణాలపై విచారణ చేస్తామని హామీ ఇవ్వటంతోపాటు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పటంతో కొంత వరకు శాంతించారు ఆందోళనకారులు. దీనిపై బీహార్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు.