
పాట్నా: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్, కూలర్లు ఉన్నప్పటికీ ఉక్కుపోత తట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సిట్యూయేషన్లో ఒక మంత్రి మాత్రం గాయం మీద కారం చల్లినట్లుగా.. మండే ఎండల్లో దుప్పట్లు పంపిణీ చేశారు. కనీసం ఇది ఏ సీజనో కూడా అవగాహన లేకుండా.. ఫక్తు రాజకీయ లబ్ధి కోసం ఎండకాలంలో దుప్పట్లు పంపిణీ చేసి విమర్శల పాలయ్యారు.
వివరాల ప్రకారం.. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం (ఏప్రిల్ 6) సందర్భంగా బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్చక్ బ్లాక్‌లోని అహియాపూర్ గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కీలక నేత, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సురేంద్ర మెహతా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 700 మంది పేదలకు దుప్పుట్లు పంపిణీ చేశారు. పేదల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అహియాపూర్‌లోని ప్రజలకు దుప్పట్లు అందించామని పేర్కొన్నారు. ఈ ఒక్క పనే మంత్రిని విమర్శలపాలు చేసింది.
ఇది ఎండకాలం అన్న కనీస సోయి మరిచి.. 40 డిగ్రీల మండే ఎండలో మంత్రి సురేంద్ర మెహతా దుప్పుట్లు పంపిణీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ లబ్ధి కోసం మంత్రి చేసిన పనిని పలువురు నెటిజన్లు విమర్శిస్తుండగా.. మరికొందరు మంత్రి తీరుపై సెటైర్లు విసిరారు. ‘‘40 డిగ్రీల మండే ఎండలో దుప్పుట్ల పంపిణీ.. నిజంగా మీరు దేవుడు సామీ’’ అంటూ కొందరు కామెంట్లు చేశారు. ‘ఎండ కాలంలో చద్దర్ల పంపిణీ.. వాట్ ఏ గ్రేట్ థాట్ సార్’ అంటూ మరికొందరు ఛలోక్తులు విసురుతున్నారు.
మంత్రి సురేంద్ర మోహతా తీరుపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత సంజీబ్ భట్టాచార్య సెటైరికల్ ట్వీట్ చేశాడు. ‘‘కాంగ్రెస్ పార్టీ బీహార్ యువత కోసం పలయన్ రోకో, నౌక్రీ దో ప్రచారాన్ని ప్రారంభించడంతో బీహార్ బీజేపీ నాయకులలో భయం మొదలైంది. అది ఎంతగా అంటే.. బీహార్ క్రీడా మంత్రి సురేంద్ర మెహతా మండుతున్న వేసవిలో దుప్పట్లు పంచేంతగా’’ అంటూ ఎద్దేవా చేశారు. దుప్పట్ల పంపిణీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండటంతో మంత్రి సురేంద్ర మోహతా దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే ఈ కార్యక్రమానికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు.
कांग्रेस पार्टी द्वारा बिहार के युवाओं की #पलायन_रोको_नौकरी_दो_यात्रा शुरू होते ही
— 𝐒𝐚𝐧𝐣𝐢𝐛 𝐁𝐡𝐚𝐭𝐭𝐚𝐜𝐡𝐚𝐫𝐲𝐚 (@BhSanjib) April 8, 2025
बिहार भाजपा नेताओं में इतना भय पैदा हुआ कि#बिहार के खेल मंत्री सुरेन्द्र मेहता की 'कंबल' योजना शुरू
भीषण गर्मी के बीच,मंत्री ने बेगूसराय में बछवाड़ा विधानसभा क्षेत्र में 700 कंबल बांटे। pic.twitter.com/XeFzWFgIB1