ఆదర్శం... అద్భుతం... సెవెన్​ సిస్టర్స్​..

ఆదర్శం... అద్భుతం... సెవెన్​ సిస్టర్స్​..

ఎన్నో అవమానాలు పడ్డారు.. జనాలు అనే మాటలకు ఆ దంపతులు ఏడుగురు ఆడపిల్లలు.. ఒక మగ పిల్లాడిని తీసుకొని వలస బాట పట్టారు.  ఆ సెవెన్​ సిస్టర్ప్​ ఏమనుకున్నారో .. ఏమో తెలియదు కాని.. జనాల నోటికి తాళం వేయించారు. అలాగా .. ఇలాగా కాదు... అందరూ పోలీస్​ డిపార్ట్​ మెంట్​ లో  జాబ్​ కొట్టేశారు.   వివరాల్లోకి వెళ్తే..

బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు అద్భుతం సృష్టించారు. పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు. దీంతో సెవెన్​ సిస్టర్స్​’ పేర్లతో పాటు వారిని సరైన మార్గంలో నడిపించిన ఆ తల్లి దండ్రుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి. సరాన్‌ జిల్లా మాంఝీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నచాప్‌ గ్రామానికి చెందిన కమల్‌ సింగ్‌, శారదా దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు , ఒక కుమారుడు. ఒక్క కొడుకు ఉంటే బాగుంటుందన్న ఆశతో వాళ్లు పిల్లలను కనుకుంటూ వెళ్లారు. చిట్టచివరికి కొడుకు జన్మించడంతో వారి కోరిక నెరవేరింది. అయితే 8 మంది పిల్లలను పోషణ కష్టమై కమల్‌సింగ్‌ దంపతులు నానా ఇబ్బందులు పడేవారు. వారిని చూసి గ్రామస్తులు నవ్వుకునేవారు. ఏడుగురు ఆడ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తారంటూ అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంది ఆ జంట. ఇరుగుపొరుగువారు మానసిక వేదనకు గురి చేయటంతో ఒకానొక సమయంలో వారు సొంత గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చప్రాలోని ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు. వ్యవసాయం చేసుకుంటూనే తన కుమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండి గిర్నీని నడిపేవాడు తండ్రి కమల్ సింగ్ . వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు.

ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బీహార్​ పోలీసు శాఖతో పాటు వివిధ కేంద్ర సాయుధ బలగాలకు పోలీసులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మొదటి కుమార్తె 2006లోనే కానిస్టేబుల్​ గా ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరూ పోలీసు శాఖలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్​ పోలీస్​ శాఖలో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు. అలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరో ఐదుగురు కూడా ఎక్సైజ్​ శాఖ, సీఆర్​పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ కేంద్ర బలగాల్లో ఎంపికయ్యారు. ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరందరూ తమ అక్కల ద్వారా నేర్చుకున్నారు. ఒకరికొకరు మార్గదర్శకులుగా మారారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు.