బీహార్‌లోని చంపారన్‌లో దారుణం
పాట్నా: బీహార్‌లో దారుణం జరిగింది. సిగరెట్ తాగిండని 15 ఏళ్ల బాలుడిని టీచర్లు బెల్టులతో కొట్టారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన హరి కిషోర్ రాయ్, ఉస్మిలా దేవి దంపతులకు బజరంగీ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. అతను "మధుబన్ రైజింగ్ స్టార్ ప్రిపరేషన్ స్కూల్"లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. బజరంగీ కుమార్ తన తల్లి మొబైల్ ఫోన్‌ను రిపేర్ చేయించేందుకు శనివారం ఉదయం మధుబన్ ప్రాంతానికి వెళ్లాడు. ఇంటికి తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఫ్రెండ్స్ కలిశారు. బజరంగీ వారితో కలిసి సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న బజరంగీ చదివే స్కూల్ చైర్మన్ విజయ్ కుమార్ వారిని చూశాడు.
ALSO READ:పాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే! టవర్ ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే...
తన స్టూడెంట్ స్మోకింగ్ చేయడం చూసి కోపంతో రగిలిపోయిన చైర్మన్.. వెంటనే బజరంగీని స్కూల్‌కు ఈడ్చుకెళ్లాడు. అక్కడ బట్టలు విప్పించి టీచర్లతో బెల్టులతో కొట్టించాడు. దాంతో బజరంగీ స్పృహతప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న బజరంగీ తల్లి, సోదరి..అతడిని ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ బజరంగీ మృతి చెందాడు. స్కూల్ చైర్మన్, ఇతర టీచర్లు తీవ్రంగా కొట్టడం వల్లే తన కొడుకు చనిపోయాడని బజరంగీ తల్లి, బంధువులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్కూల్ కు సీలు వేయనున్నట్లు పేర్కొన్నారు.