ఆడుకుంటున్న పిల్లలపై మంత్రి కుమారుడి దారుణం

ఓ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. తుపాకీతో కాల్పులకు దిగాడు. పిల్లలపై కాల్పులు జరపడంతో నలుగురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన బీహార్ లో కలకలం రేపింది.  రాష్ట్రంలో నౌతన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బీహార్‌ పర్యాటకశాఖ మంత్రి నారాయణప్రసాద్‌ కుమారుడు   బబ్లూ ప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంటికి సమీపంలో ఉన్న మామిడి తోట దగ్గర క్రికెట్ ఆడుకుంటున్న కొంతమంది పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు వాళ్లు  నిరాకరించడంతో వారితో ఘర్షణ పడ్డాడు. మంత్రి తనయుడు దూకుడుగా వ్యవహరించడంతో అక్కడున్న స్తానికులు అతడ్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే అతడిపై రాళ్లు రువ్వారు. 

దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన మినిస్టర్ కొడుకు తన అనుచరవర్గంతో వాహనాల్లో వచ్చి స్థానికులపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఈఘటనలో నలుగురు గాయపడ్డారు.  ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో మంత్రి ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లారు. అక్కడున్న మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇదంతా జరుగుతుండగానే మంత్రి కుమారుడు బబ్లూప్రసాద్‌ అక్కడి నుంచి పారిపోయాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. మంత్రి ఇంటి దగ్గర ఓ తుపాకితో పాటు ఓ రైఫిల్‌ని స్వాధీనం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి కుమారుడిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామస్థులు తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నారాయణ ప్రసాద్ చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్​ కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైంది

క్యాన్సర్​ పేషెంట్లకు ఫ్రీగా విగ్స్​