![బిజినేపల్లి పాత ఎంపీడీవో .. ఆఫీసులో మంటలు](https://static.v6velugu.com/uploads/2025/02/bijenepally-old-mpdo-office-fire_RGFkCm6iLb.jpg)
- గుర్తు తెలియని వ్యక్తి మృతి
- కాలిబూడిదైన పాత ఫైళ్లు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఎంపీడీవో పాత ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తితో పాటు ఫైళ్లు కాలి పోయిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీవో ఆఫీస్‌కు కొత్త బిల్డింగ్ నిర్మించగా.. పాత ఆఫీసును స్టోర్ రూమ్‌గా మార్చారు. అందులో ఫైల్స్ ను భద్రపరిచారు. ఆదివారం రాత్రి దాని పక్కనే నిల్వ ఉంచిన టీ ఫైబర్ ఆఫీస్ పైపులకు మంటలంటుకుని.. ఎంపీడీవో పాత ఆఫీసులోకి వ్యాపించాయి.
స్థానికులు చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలను ఆర్పి.. లోనికి వెళ్లి చూడగా కాలిపోయిన ఫైల్స్ తో పాటు గుర్తు తెలియని వ్యక్తి(50 ) డెడ్ బాడీని గుర్తించారు. ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పాత ఎంపీడీవో ఆఫీసు ఘటన ప్రమాదామా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.