బీఆర్ఎస్ లో కలకలం : భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నేత చిట్టెడి భగవంతరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. 2023, జూన్ 20వ తేదీ రాత్రి.. ఓ వ్యవసాయ బావి దగ్గర ఉన్న రేకుల గదిలో టవల్ తో ఉరి వేసుకుని చనిపోయారు. 52 ఏళ్ల భగవంతరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతగా గుర్తింపు పొందారు. రాజకీయంగా ఎదిగారు. ఈ క్రమంలో భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. భగవంతు రెడ్డి మృతి పట్ల ప్రభుత్వ విప్, కామారెడ్డి  ఎమ్మెల్యే  గంప గోవర్దన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అప్పుల విషయంలో ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన భగవంతరెడ్డి.. మండల కేంద్రం శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలోని.. వ్యవసాయ బావి దగ్గర ఉన్న రేకుల గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. 

భగవంతరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పులు భరించలేక, ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పనులు కూడా చేశారని.. వాటికి సంబంధించిన బిల్లులు రాలేదని చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

2002 నుంచి అంటే.. 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. భగవంతరెడ్డి మృతి తీరని లోటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.