హాలియా, వెలుగు : బైక్ పై వస్తున్న దంపతులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఏడాదిన్నర బాబు, భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మునగబాయిగూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన మహేశ్ తన భార్య శైలజ, కుమారుడు సందీప్ తో కలిసి అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామంలో తన అత్తగారింటికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురూ బైక్ పై స్వగ్రామానికి బయలుదేరారు.
పంగవానికుంట మేజర్ కాల్వ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు.. వారి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుంచి ముగ్గురూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే చనిపోయాడు. మహేష్, శైలజ తీవ్రంగా గాయపడ్డారు.
వారిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆసుపత్రి తరలిస్తుండగా శైలజ (23) మార్గం మధ్యలో మృతి చెందింది. మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. హాలియాఎస్సై శోభన్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శైలజ నిండు గర్భిణి