బైక్‌‌, స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌ మండలం మైసిగండి వద్ద ప్రమాదం

  • బైక్‌‌, స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి
  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌ మండలం మైసిగండి వద్ద ప్రమాదం

ఆమనగల్లు, వెలుగు: బైక్‌‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో బాలుడికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మాడ్గుల్‌‌ మండలం ఇర్విన్‌‌ గ్రామానికి చెందిన బావాజీ భీమయ్య (46) కొడుకు శివ మహేశ్వరం గురుకుల స్కూల్‌‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌‌కు సెలవులు ఇవ్వడంతో శివను తీసుకొచ్చేందుకు భీమయ్య, తన బంధువు వెంకటయ్య (45)తో కలిసి బైక్‌‌పై శుక్రవారం సాయంత్రం స్కూల్‌‌ వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి బైక్‌‌పై గ్రామానికి తిరిగి వస్తుండగా మైసిగండి ఆలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన స్కార్పియో ఢీకొట్టింది.

అనంతరం ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో అది కూడా బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు భీమయ్య, శివను హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ భీమయ్య చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్‌‌ తెలిపారు. కాగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌‌ చేస్తూ బంధువులు శనివారం కడ్తాల్‌‌ పీఎస్‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.