హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండేండ్లలో 16 సార్లు బైక్ రిపేర్ తో విసిగిపోయిన కస్టమర్ కు రూ. 30 వేల నష్ట పరిహారం చెల్లించాలని బైక్ కంపనీని స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన బోర్కరి గంగయ్య 2020లో ఐదేండ్ల వారంటీతో హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ ఐ. స్మార్ట్ బైక్ ను రూ.83వేలు పెట్టి కొన్నాడు.
కొన్న కొద్దిరోజులకే రిపేర్ రావడం మొదలైంది. అలా రెండేండ్లల్లో16 సార్లు ఏదో విధంగా బైక్ రిపేర్ కు రావడం, పని మానేసి గ్యారేజ్ చుట్టూ తిరిగాడు. దాంతో విసిగిపోయిన గంగయ్య తనకు కొత్త బైక్ లేదా తన డబ్బు రూ.83 వేలు తిరిగి ఇవ్వాలని హీరో కంపెనీని కోరగా నిరాకరించింది. దాంతో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ ను సంప్రదించాడు.
విచారణ అనంతరం వినియోగదారునికి బైక్ డబ్బులు రూ.83వేలు, మానసిక వేదనకు గురిచేసినందుకుగాను రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని హీరో కంపనీని ఫోరమ్ ఆదేశించింది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందని హీరో కంపెనీ స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ లో అప్పీల్ చేసింది. రిపేర్ రావడం నిజమే కానీ, బైక్ నాణ్యతలో ఎలాంటి లోపం లేదని బైక్ కంపెనీ నిరూపించింది.
అలాగే..కస్టమర్ బైక్ ను రెండేండ్లు నడిపిన తర్వాత పూర్తి పరిహారాన్ని ఇవ్వలేమని హీరో కంపెనీ వివరణ ఇచ్చింది. ఇద్దరి వాదనలు విన్న.. స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ ఇచ్చిన తీర్పును సరిచేస్తూ.. వినియోగదారునికి రిపేర్లతో ఇబ్బంది పెట్టినందుకు రూ.30 వేలు నష్టపరిహారాన్ని అందించాలని హీరో కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.