బైక్ రేసింగ్ లతో హడలెత్తిస్తోన్న ఆకతాయిలు.. చర్యలు శూన్యం

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

రోడ్లపై డేంజరస్ ఫీట్లు చేస్తూ తోటి వాహనదారులను హడలెత్తిస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇదే తంతు సాగిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. వీరి వల్ల స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.  రేసింగ్ లకు పాల్పడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లే ఉంటున్నారు.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తాపత్రయమే వీరిని ఇలాంటి పనులకు ఉసిగొల్పుతోంది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా వారు కేవలం చలాన్లు వేయడానికే పరిమితం అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.