రైతు రుణమాఫీ చేశాం.. హరీశ్ రాజీనామా చెయ్

రైతు రుణమాఫీ చేశాం.. హరీశ్ రాజీనామా చెయ్
  • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డిమాండ్
  • సిద్దిపేట ఉప ఎన్నికలో ఇద్దరం పోటీ చేద్దాం
  • ఓడిపోతే రాజకీయాల్లోంచి తప్పుకుందామని సవాల్

సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రైతుల రూ.2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని.. హరీశ్​ రావు చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డిమాండ్​ చేశారు. ఉప ఎన్నికలో ఇద్దరం కలిసి పోటీ చేద్దామని, ఓడిపోయినవాళ్లం రాజకీయాల్లోంచి తప్పుకుందాం అంటూ సవాల్ విసిరారు. మంగళవారం సిద్దిపేటలోని పొన్నాల చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి మైనంపల్లి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం టౌన్​లో భారీ ర్యాలీ నిర్వహించి.. పాత బస్టాండ్ చౌరస్తా వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మైనంపల్లితో ఇబ్బంది పోవాలంటే హరీశ్ రావు పోటీ చేసి గెలవాలి. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ లేదా మైనంపల్లిలో ఎవరో ఒక్కరే ఉండాలని అడుగుతున్నాను’ అని అన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతలు మంచి సూచనలు ఇవ్వడం మర్చిపోయి రూ.2 లక్షల రుణమాఫీ జీవిత కాలంలో సాధ్యపడదని కేసీఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. నలభై ఏండ్లుగా సిద్దిపేటలో మామ కేసీఆర్, అల్లుడు హరీశ్​రావు రాక్షస పాలన చేస్తున్నారని, వారి నుంచి సిద్దిపేటకు విముక్తి లభించేలా కృషి చేస్తానన్నారు. రంగనాయక సాగర్ వద్ద పేద రైతుల భూములను లాక్కొని హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడని,  58,59 జీవోల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు.

సిద్దిపేటలో భారీ ర్యాలీ

సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులతో కలసి మైనంపల్లి హన్మంతరావు భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్నాల చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి బీజేఆర్ చౌరస్తా, ఎన్సాన్ పల్లి రోడ్డు, భారత్ నగర్, మెదక్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, పార్టీ సిద్దిపేట ఇన్​చార్జ్ పూజల హరికృష్ణ, బొమ్మల యాదగిరి, దర్పల్లి చంద్రం, సూర్య వర్మ, కలీమొద్దీన్ తదితర నేతలు పాల్గొన్నారు.