చెన్నూర్​ కాంగ్రెస్​లో జోష్​..వివేక్​ వెంకటస్వామి భారీ బైక్​ ర్యాలీ

  •     మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 7 వరకు కొనసాగిన ర్యాలీ
  •     స్వచ్ఛందంగా తరలి వచ్చిన వేలాది మంది జనం
  •     జై కాంగ్రెస్, జై వివేక్ నినాదాలతో మార్మోగిన చెన్నూర్

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో సోమవారం కాంగ్రెస్​ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీ సక్సెస్ కావడంతో ఆ పార్టీలో జోష్​ నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జైపూర్ మండలం ఇందారంలో మొదలైన ర్యాలీ ఇందారం క్రాస్ రోడ్, రసూల్ పల్లి, జైపూర్,  భీమారం, కిష్టంపేట మీదుగా సాయంత్రం 6 గంటలకు చెన్నూరుచేరుకుంది.

మార్గంమధ్యలో ఆయా గ్రామాల ప్రజలు వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వివేక్​వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. చెన్నూరులోనూ జిన్నింగ్ మిల్లు వద్ద స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం బస్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా పాత ఎమ్మార్వో ఆఫీస్​వరకు  ర్యాలీ కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు జనం తమ ప్రియతమ నేత వెంటే ఉండి జేజేలు పలికారు.

5వేలకు పైగా బైకులు, వేలాది మంది జనంతో సాగిన ర్యాలీ విజయోత్సవ సంబురాలను తలపించింది. ప్రచారంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అడ్వకేట్ శరథ్, కాంగ్రెస్ ​లీడర్లు మూల రాజిరెడ్డి, పాపిరెడ్డి, ఐత హిమవంత రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ విఠల్, బాపిరెడ్డి, ఫయాజ్, చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పోటు రామరెడ్డి, చల్లా రాంరెడ్డి, మైదం రవి, కళావతి   తదితరులు పాల్గొన్నారు.