సూర్యాపేట, వెలుగు : వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్రూల్స్ పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో విధిగా హెల్మెట్, సీట్ బెల్టు పెట్టుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించకొని గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సదర్భంగా కలెక్టర్ బైక్ పై డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.
సదరంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు..
సదరం సర్టిఫికెట్స్ పంపిణీలో అవకతవకులకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. పట్టణంలోని మెడికల్ కాలేజీలో ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాల హెచ్వోడీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ జనవరిలో నిర్వహించే సదరం క్యాంప్ లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, క్యాంపుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి పొరపాటు జరిగినా డాక్టర్ దే పూర్తి బాధ్యత అని తెలిపారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు..
నల్గొండ అర్బన్, వెలుగు : భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎన్.వాణి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నల్గొండలోని డైట్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.