మధ్యప్రదేశ్‌లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. బైకుల మీద తిరుగుతూ గన్‌లతో ఇష్టంవచ్చినట్లుగా కాల్పులు జరిపారు. మొరెనాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంఖండి రోడ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఒక మహిళ తలకు గాయమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కాల్పులకు పాల్పడ్డ వారిలో కొంతమందిని అరెస్టు చేశాం. మిగతావారిపై కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ చట్టానికి అతీతులు కారు. ఈ ఘటనకు ముందురోజు ఒక వర్గం సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టింది. ఆ పోస్టుకు ప్రతీకార చర్యగా ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది’ అని అదనపు ఎస్పీ డాక్టర్ రాయ్‌సింగ్ నర్వారియా తెలిపారు.
దుండగుల కాల్పుల్లో గాయపడిన మహిళ భర్త ప్రదీప్ శర్మ మాట్లాడుతూ.. ‘నా భార్య ఆరోగ్యం బాగోలేక వైద్యుడి దగ్గరకు వెళ్తుండగా.. కొంతమంది వ్యక్తులు ముసుగులు ధరించి మోటారు సైకిళ్ళపై ఎదురుగా వస్తున్నారు. వారి చేతుల్లో గన్‌లు ఉన్నాయి. అది చూసి నా భార్య పరిగెత్తుతూ కిందపడడంతో తలకు గాయమైంది. ఆ సమయంలో దుండగులు గాలిలోకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అంతేకాకుండా రోడ్డు పక్కన వాహనాలను నాశనం చేశారు’ అని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే 15 వరకు లాక్‌డౌన్ విధించారు. ఈ సమయంలో ఇంతమంది దుండగులు గన్‌లతో బైకుల మీద తిరుగుతూ కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది.
#CoronaCurfew not in Morena! dozens masked riding mobikes openly firing targeting the other caste over a social media post! @GargiRawat @ndtv @ndtvindia pic.twitter.com/B7GG8tXAa1
— Anurag Dwary (@Anurag_Dwary) May 8, 2021