- ఐటీ కారిడార్‌లో ఆకతాయిల బీభత్సం
- నాలెడ్జ్ సిటీ దగ్గర హల్చల్
- రోడ్లపై ఐటీ బిల్డింగులకు తగిలిన పటాకులు
- బిత్తరపోయి జనాల పరుగులు
గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్ రోడ్లపై శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు బైక్‌లకు ముందు షాట్స్(పటాకులు) కట్టుకుని పేలుస్తూ రేసింగ్ చేస్తూ రెచ్చిపోయారు. ఇతర వాహనదారులు, పక్కన జనాలున్నా పట్టించుకోకుండా హంగామా చేశారు. కొందరైతే చేతిలోనే రాకెట్స్ పేలుస్తూ పక్కనున్న బిల్డింగులపైకి వదిలారు. దీంతో జనాలు బిత్తరపోయి అటూ ఇటూ పరుగులు తీశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సుమారు 30 మంది యువకులు స్పోర్ట్స్బైక్స్పై నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్న టీ హబ్ రోడ్డుపైకి చేరుకున్నారు. బైక్స్ ముందు షాట్స్ కట్టుకుని రేసింగ్‌కు రెడీ అయ్యారు.
షాట్స్‌కు నిప్పంటించి రేసింగ్ చేశారు. ముందు టైర్లను గాల్లోకి లేపి షాట్స్ వదలడంతో కొన్ని చుట్టుపక్కల బిల్డింగులను తాకుతూ వెళ్లాయి. మరికొన్ని బిల్డింగులపై పడ్డాయి. రాయదుర్గం పోలీసులు 26 మంది రేసర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బైకులను సీజ్‌చేశారు. బైక్ రేసింగ్‌లను వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయడంతో వైరల్ అయ్యాయి.
ఎటు పోతోందీ సమాజం : సజ్జనార్ ట్వీట్
ఐటీ కారిడార్‌లో బైక్‌కు పటాకులు కట్టుకుని రేసింగ్చేసిన ఘటన వీడియోలు చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.