ఏ బట్టలు ధరించాలనేది ఆడవాళ్ల ఇష్టం

న్యూఢిల్లీ: ఆడవాళ్లు ఏ బట్టలు వేసుకోవాలనేది వారి ఇష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం మహిళల వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కర్నాటకలో వివాదాస్పదంగా మారిన హిజాబ్ ఘటనపై స్పందనగా ప్రియాంక పైవ్యాఖ్యలు చేశారు. ‘బికినీ, ఘూంఘట్ (ముసుగులు), జీన్స్ లేదా హిజాబ్ (బుర్ఘా) ఏది ధరించాలనేది మహిళల ఇష్టం. స్త్రీలు తమకు నచ్చినవి వేసుకునే హక్కు ఉంది. దీన్ని భారత రాజ్యాంగం వారికి ప్రసాదించింది. మహిళల్ని వేధించడం ఆపండి’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. లడ్కీ హూ, లడ్ సక్తీ హూ (మహిళను.. పోరాడగలను) అనే క్యాప్షన్ ను ఈ ట్వీట్ కు ఆమె జోడించారు. ఈ ట్వీట్ కు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లైక్ కొట్టారు. 

కాగా, కర్నాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ వేదికగా కోరారు. ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మూడురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు విచారణ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

అమాయక విద్యార్థుల్లో విభజన ఏర్పడే ప్రమాదం

జట్టుతో కలసి రఫ్ఫాడిస్తానంటున్న బిగ్ బీ

కేర‌ళ ట్రెక్క‌ర్‌ను ర‌క్షించిన ఆర్మీ